విజయవాడ జీజీహెచ్‌లో రోగుల సహనానికి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

విజయవాడ జీజీహెచ్‌లో రోగుల సహనానికి పరీక్ష

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

విజయవాడ జీజీహెచ్‌లో రోగుల సహనానికి పరీక్ష లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి, వైద్యం కోసం వచ్చిన రోగుల సహనాన్ని ఆస్పత్రి అధికారులు పరీక్షిస్తున్నారు. ఒకవైపు జబ్బు వేధిస్తుండగా, మరోవైపు క్యూలైన్‌లో నిల్చోలేక రోగులు సొమ్మసిల్లుతున్నారు. ఓపీ కౌంటర్‌తో పాటు మందులు ఇచ్చే ఫార్మసీ వద్ద, రక్తపరీక్షలు, ఎక్స్‌రే రిజిస్ట్రేషన్‌ల వద్ద, రిపోర్టులు తీసుకునే వద్ద ఇలా ప్రతిచోట 30నిమిషాల నుంచి గంట వరకూ రోగులు క్యూలో ఉంటున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు ఒక్కోసారి సొమ్మసిల్లి పడిపోయినా సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు. రోగులు ఓపీ చీటీ తీసుకోవాలంటే అరగంటకు పైగా క్యూలో ఉండాల్సి పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ కొత్తాస్పత్రికి 2,200 నుంచి 2,500 వరకూ రోగులు వస్తుంటారు. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. అంటే వారంతా ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య మూడు గంటల వ్యవధిలోనే వస్తుంటారు. ఆ మూడు గంటల వ్యవధిలో అంత మందికి ఓపీ చీటీలు సక్రమంగా ఇవ్వాలంటే ఎన్ని కౌంటర్‌లు అవసరమో అధికారులు ఇప్పటి వరకూ ఆలోచన కూడా చేయలేదు. ఉన్న కౌంటర్‌లలో కంప్యూటర్‌ పనిచేస్తే, ప్రింటర్‌ పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఓపీ కౌంటర్‌ పక్కనే ఉన్న ఫార్మసీ వద్ద మందులు తీసుకోవాలంటే రోగులు కుస్తీ పట్టాల్సిందే. అక్కడ ఉన్న ఒకరిద్దరు సిబ్బంది, వందలాది మంది రోగులకు మందులు ఇచ్చేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వైద్యశాఖ మంత్రి ఆస్పత్రిని సందర్శించిన సమయంలో కూడా ఈ క్యూలైన్‌ ఉంది. అయినప్పటికీ అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. పేదల కష్టాలు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫార్మసీ వద్ద మందుల కోసం నిత్యం రోగులు క్యూలో కుస్తీ పడుతూ ఉంటారు. ఆస్పత్రిలో ఈ పరిస్థితిపై సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌లో ప్రయత్నించగా, ఆమె స్పందించలేదు.

రక్తపరీక్షల రిజిస్ట్రేషన్‌ వద్దా అంతే..

సెంట్రల్‌ డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌లో రక్తపరీక్షల శాంపిల్‌ తీసుకునే ముందు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. దాని కోసం అరగంట పాటు క్యూలో ఉండాల్సిన పరిస్థితి. ఎక్స్‌రే తీయించుకోవాలన్నా అంతే. ఇక రక్తపరీక్షల అనంతరం రిపోర్టుల కోసం గంటల తరబడి రోగులు క్యూలో ఉంటున్న పరిస్థితి ఉంది. రోగులు ఇన్ని అవస్థలు పడుతున్నా.. అధికారులు మాత్రం తమకేమీ పట్టదనట్లు ఏసీ గదులు వీడటం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే వేలాది మంది రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు రోగుల క్యూ కష్టాలపై దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు.

ఓపీ రిజిస్ట్రేషన్‌, మందుల

వద్ద బారులు తీరుతున్న జనాలు

రక్త పరీక్షల వద్ద కూడా అదే పరిస్థితి

నిత్యం ఇదే విధంగా

క్యూ ఉంటున్నా పట్టించుకోని వైనం

పెద్దాస్పత్రిపై సర్కారు నిర్లక్ష్య వైఖరి

ఓపీతో కష్టాలు మొదలు..

మందుల కోసమూ అవే పాట్లు..

Advertisement
 
Advertisement
Advertisement