కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి యాప్‌తో ఎరువుల దుర్వినియోగానికి అడ్డుకట్ట కొనసాగుతున్న మూల్యాంకనం వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

పెనమలూరు: తల్లులు కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారి స్టేట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధాన మంత్రి సురక్షిత్‌ అభియాన్‌(పీఎంఎస్‌ఎంఏ) కార్యక్రమంలో భాగంగా మాతృత్వ కిల్కారి సేవలపై తల్లులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రతి గర్భిణి నాలుగో నెల నుంచి బిడ్డ పుట్టిన సంవత్సరం వరకు కిల్కారి కాల్స్‌ ప్రతి నెలకు ఒకసారి వస్తాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. డాక్టర్‌ సుష్మిత మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రతీ నెల 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలన్నారు. కిల్కారి పీవో రాజు, సీహెచ్‌వో కుమార్‌, హెచ్‌వీ పుష్పావతి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

జి.కొండూరు: ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఏఐఎంఎస్‌ యాప్‌తో అర్హులైన రైతులకు రాయితీపై ఎరువులు సకాలంలో అందుతాయని కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని వెలగలేరు గ్రామంలో శ్రీసాయి ఎంటర్‌ ప్రైజెస్‌ ఎరువుల దుకాణంలో యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను కలెక్టర్‌ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఎరువుల దుకాణాలతో పాటు సహకార సొసైటీలు సైతం ఈ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, తహసీల్దార్‌ రాణి, ఏఓ సూరిబాబు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ, ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన కార్యక్రమం రెండో రోజు సజావుగా కొనసాగిందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపా రు. మంగళవారం ఆయన మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. మూల్యాంకనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే లా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఓ చెప్పారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో వేద, స్మార్త విద్యలను అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విధిగా ఉపనయనం జరిగి, సంధ్యావందనం చేస్తూ తెలుగు చదవగలిగిన బాలురు ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. స్మార్త విద్యకు 10 నుంచి 13ఏళ్లు, వేద విద్యకు 10 నుంచి 12 ఏళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాఠశాలలో రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, అపస్తంబ పౌరోహిత్య స్మార్త విద్యను బోధిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలతో పాటు కోర్సు పూర్తి చేసి తుది పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలతో పాటు రూ. 3లక్షలు స్టయిఫండ్‌ను అందిస్తారన్నారు. ఇతర వివరాలకు పోరంకిలోని దేవస్థాన వేద పాఠశాల ప్రిన్సిపాల్‌ను 9440136924లో సంప్రదించవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement