విద్యార్థుల జీవితాలతో సీబీఎస్‌ఈ ఆటలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో సీబీఎస్‌ఈ ఆటలు

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

విద్యార్థుల జీవితాలతో సీబీఎస్‌ఈ ఆటలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సీబీఎస్‌ఈ తన అసమర్ధతతో దేశంలోని లక్షలాది యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ అన్నారు. సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంలో అవకతవకల తీరును ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో విజయవాడ సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.

కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి..

ఈ సందర్భంగా బందెల నాసర్‌జీ మాట్లాడుతూ నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ జరిగి నెలరోజులు కాకుండానే సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంలో అవకతవకలు జరగటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం అనేక వేలమంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవ్యాల్యుయేషన్‌ దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో భాగంగా వేదాంత్‌ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని స్కాన్‌ కాపీ కోరాడన్నారు. వచ్చిన పేపర్‌ తాను రాసిన జవాబు పత్రమే కాదని సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశారని చెప్పారు. సంజన, మోక్ష, హర్షిత విద్యార్థుల పేపర్లు అసలు రీవ్యాల్యుయేషన్‌ చేయలేదని వాపోయారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్‌ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానంలో అనేక సాంకేతిక సమస్యలు బయటకు వచ్చాయన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివా, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement