నిడమానూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇళ్ల కూల్చివేతకు యత్నం ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని పేదల ఆగ్రహం పేదలు అడ్డుకోవడంతోప్రస్తుతానికి వెనుతిరిగిన అధికారులు
జేసీబీలతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా శతాబ్దానికి పైగా నివాసం ఉంటున్న నిరు పేదల ఇళ్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ జేసీబీలతో రంగంలోకి దిగి బలవంతంగా నివాసాలు తొలగించేందుకు యత్నించగా పేదలు అడ్డుకున్నారు. తహసీల్దార్ సుగుణ, ఏసీపీ దామోదర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది హడావుడి చేస్తూ ఇళ్లు తొలగించ డానికి పూనుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత పేదలు, స్థానిక నాయకులు జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు చేసేదేమీ లేక ప్రస్తుతానికి వెను తిరిగారు.
100 ఏళ్లుగా పైగానే స్థిర నివాసాలు
గ్రామంలోని రైవస్ కాలువ, సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో 100 సంవత్సరాలకు పైగానే నిరు పేదలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 83 గృహల్లో పేదలు నివస్తుండగా, మరో 20 మంది చిన్నపాటి దుకాణాలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ, రైల్వే అధికారులు ఓవర్ బ్రిడ్డి నిర్మాణమంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రాంతంలో కొలతలు తీసుకున్నారు. రహదారికి రెండు వైపులా ఉన్న ఇళ్లను తొలగించాలని హుకుం జారీ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సిర్థ నివాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నామని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇళ్లు ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రెండు రోజులుగా ఫ్లై ఓవర్ బాధితుల పోరాట కమిటీగా ఏర్పడి ఇళ్ల తొలగింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. శనివారం ఇళ్లు కూల్చివేతకు అధికారులు రావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, మహిళా నాయకురాలు పరిమి సింధు, దండు సుబ్రహ్మణ్యరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు మద్దతు తెలిపి బాధితుల నిరసనలో పాల్గొన్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందుగానే బాధితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు.


