చిలకలపూడి(మచిలీపట్నం): యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యమవుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం జెడ్పీ కన్వెన్షన్ హాల్‌లో మాస్టర్ ట్రైనర్ల యోగా శిక్షణ తరగతులను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ యోగాను క్రమం తప్ప కుండా ఆచరిస్తే భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందొచ్చన్నారు. యోగా వల్ల నాణ్యమైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడతాయని వివరించారు. మాస్టర్ ట్రైనర్లుగా ఎంపికై న వారు ముందుగా యోగా ప్రయోజనాలను స్వయంగా అనుభవించి, ఆ తరువాత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 200 మంది మాస్టర్ యోగా ట్రైనర్లకు రెండు రోజుల పాటు ఐదు సెషన్లలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ప్రతి మాస్టర్ ట్రైనర్ తమ మండలంలో 50 మంది చొప్పున యోగాలో శిక్షణ ఇచ్చి, ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యోగా గురువులు రెబ్బా పోతన శాస్త్రి, శేష ప్రసన్న, చింతయ్య తదితరులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్వో, డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, యోగాంధ్ర కార్య క్రమ నోడల్ అధికారి, మెప్మా పీడీ సాయిబాబు, ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ భాగ్యలక్ష్మి, వాహిని, డీఈఓ యు.వి.సుబ్బారావు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ వెంకటరావు, మచిలీపట్నం నార్త్ మండలం తహసీల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ ఇలా..
ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఏడో తేదీ ఉదయం ఏడు గంటలకు మంగినపూడి బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 10వ తేదీ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటో సంఘాల ప్రతినిధులతో, 16వ తేదీన ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


