అవనిగడ్డ: ప్రముఖ సాహితీవేత్త, కళారత్న పురస్కార గ్రహీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గుడిసేవ విష్ణుప్రసాద్ (65) శనివారం గుండెపోటుతో మరణించారు. పదిహేను రోజుల క్రితం జీర్ణసంబంధిత సమస్యతో విజయవాడలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం అవనిగడ్డలోని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో విజయవాడ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయనకు భార్య, వివాహిత కుమార్తె ఉన్నారు. దివిసీమ సాహితీ సమితి అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2018లో ఆనాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లో నిర్వహించిన పలు సాహిత్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ‘దివిసీమ కవుల సాహిత్య పరిశోధన’ అంశంపై పరిశోధన చేసిన ఆయన ప్రత్యేక గ్రంథాన్ని ముద్రించారు. 25కు పైగా గ్రంథాలు రచించారు. విష్ణుప్రసాద్ భౌతికఖాయాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. పలువురు సాహితీకారులు, కవులు, కళాకారులు ఆయన మృతికి సానుభూతి తెలిపారు.
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలోని శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వ స్వామి వారి ఆలయంలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై రెండో విడత విచారణ కొనసాగుతోంది. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ లలిత మరో నలుగురితో ఉన్న కమిటీ సభ్యులు శనివారం రికార్డులు తనిఖీ చేశారు. గతంలో ఈవోగా పని చేసిన గంగాధరరావు హయంలో జరిగిన లావాదేవీలు, ఇతర పనులకు సంబంధించి రికార్డులు చూశారు. ఆలయంలో చాలా కాలంగా విచారణ చేసినా అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై వివరాలను భక్తులకు వెల్లడించలేదు. విచారణలో అధికారులు ఏమి గుర్తించారో చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


