డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద డ్రైవర్ పక్కన ఉండే బానెట్‌లో నుంచి పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. భయపడిపోయిన కొంత మంది యువకులు ఎమర్జెన్సీ ద్వారం, కిటికీల నుంచి బయటపడ్డారు. బానెట్ కింద ఉండే ఇంజిన్ వద్ద ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో పొగలు ఆ తరువాత మంటలు వచ్చి ఉంటాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.


