స్మార్ట్‌ పోలీసింగ్‌లో ప్రతిభకు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పోలీసింగ్‌లో ప్రతిభకు ప్రశంస

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

స్మార్ట్‌ పోలీసింగ్‌లో ప్రతిభకు ప్రశంస నవహారతులు పునఃప్రారంభం 8, 9న ఉచిత చేపమందు పంపిణీ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 2026–27వ విద్యా సంవత్సరానికి కడపలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలల్లో 4 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసిందని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 7వ తేదీ ఆదివారంలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4వ తరగతిలో 40సీట్లు (20 బాలికలు, 20 బాలురు), 5వ తరగతిలో 23 సీట్లు (6–బాలురు, బాలికలు–17), 6వ తరగతిలో 12సీట్లు (8–బాలికలు, 4–బాలురు), 7వ తరగతిలో 23సీట్లు (8 బాలురు, 15 మంది బాలికలు), 8వ తరగతిలో 8సీట్లు (3–బాలురు, 5–బాలికలు), 9వ తరగతిలో 26 సీట్లు(16–బాలురు, 10–బాలికలు) ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆదివారం లోగా ఏపీస్పోర్ట్స్‌స్కూల్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించాల్సిందిగా కోరారు. ఇతర వివరాలకు 98661 34016, 80969 63679లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు వేగంగా సేవలు అందిస్తూ.. స్మార్ట్‌ పోలీసింగ్‌లో ప్రతిభ చూపిన వారికి శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతివారం ఇస్తున్న ర్యాంకింగ్‌లో 16 వారాలుగా స్మార్ట్‌ పోలీసింగ్‌లో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుండటంతో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. నగరంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ నేరాలు జరగకుండా చూడటం, ఒకవేళ జరిగినా సాంకేతికత, ఇన్వెస్టిగేషన్‌ స్కిల్స్‌ ఉపయోగించి నిందితులను వెంటనే పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్‌) కేజివి సరిత, సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కె. కృష్ణప్రసన్న, ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: దుర్గగుడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద నవహారతుల కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతులు ఇచ్చారు. అనంతరం నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో నవహారతులు ఇచ్చారు. గతంలో కృష్ణానదిలో ఫంటు ఏర్పాటు చేసి నవహరతులు ఇచ్చేవారు. హారతులతో పాటు హారతులు తిలకించడం, ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవారు. ఇప్పుడు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజారులు హారతులు ఇచ్చారు. దుర్గ గుడి ఆలయ కమిటీ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటనాగ కిశోర్‌ కుమార్‌, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మృగశిరకార్తె ప్రవేశం సందర్భంగా ఈనెల 8, 9న ఊపిరితిత్తులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వనమూలికలతో తయారు చేసిన చేపమందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కొండపల్లికి చెందిన మహ్మద్‌ మహ్మద్‌ ఆలీ, మహ్మద్‌ మసూద్‌ ఆలీ (జిన్నా) సంయుక్తంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పారిశ్రామిక కాలుష్యం ఈ వ్యాధులకు ప్రధాన కారణాలన్నారు. చేపమందు కోసం వచ్చేవారు ప్రాణంతో ఉన్న బురదమట్ట, కొరమేను చేపపిల్లను వెంట తెచ్చుకోవాలన్నారు. బతికున్న చేపకు వనమూలికల ఔషధం తినిపించి, రోగికి మింగిస్తామని, శాఖాహారులకు అనుపానంతో మందు ఇస్తామని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement