పెడన: పాలనను ప్రజలకు చేరువ చేసి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శుక్రవారం కలెక్టర్ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలసి పెడన మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రత్యేక మీ కోసం కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గంలో మూడో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించామని.. ప్రజల నుంచి మొత్తం 53 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, ఎంపీడీవో నూతలపాటి శ్రీనివాసరావు, ఆర్టీసీ పర్యవేక్షకుడు గోపాల్, విద్యుత్ శాఖ ఈఈ గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ కొండయ్య, పెడన తహసీల్దార్ వహీదా, ఎంపీడీవో అరుణ, గూడూరు తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీవో శైలజ, బంటుమిల్లి ఎంపీడీవో శివప్రసాద్ దేవదాయ శాఖ ఈవో అరుణ పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● తమ గ్రామానికి ఆర్టీసీ బస్సులు తిరిగి నడపాలని కోరుతూ కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామస్తులు టి. ఆంజనేయులు, బి. సాయికుమార్, జి. రాము కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. గతంలో బందరు డిపో నుంచి గ్రామానికి ఆర్టీసీ బస్సు వస్తూ ఉండేదని, తర్వాత బస్సు నిలిపివేయడంతో మత్స్య ఉత్పత్తులను అమ్ముకునే వ్యాపారస్తులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
● మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి ఆనుకుని ఒక కిలోమీటర్ దూరం లోపలికి తమ గ్రామానికి ఉన్న రహదారి గుంతల మయమై చాలా ఇబ్బందులు పడుతున్నామని రహదారి సమస్యను పరిష్కరించాలని గూడూరు మండలం తరకటూరు గ్రామపంచాయతీ పరిధిలోని తరకటూరుపాలెంకు చెందిన కేవీ రమణ, కె.కృష్ణ, పూర్ణ, నరేంద్ర అర్జీ సమర్పించారు.
● రీ సర్వే తర్వాత అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలలో తమ భూమిని తక్కువగా చూపించారని, వాస్తవానికి ఉన్న భూమి ఎక్కువని దానిని సరిచేయాలని కోరుతూ పెడన మండలం జింజేరు గౌడ పాలెం గ్రామానికి చెందిన రాజులపాటి పూర్ణ, పెడన మండలం దేవరపల్లి గ్రామ వాసి జే. వరలక్ష్మి అర్జీ అందించారు.
పెడన ప్రత్యేక ‘మీ కోసం’లో
కలెక్టర్ డీకే బాలాజీ


