అర్హుల ఓట్లు పోకుండా చూడండి | - | Sakshi
Sakshi News home page

అర్హుల ఓట్లు పోకుండా చూడండి

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

అర్హుల ఓట్లు పోకుండా చూడండి

మచిలీపట్నంటౌన్‌: అర్హులైన ఏ ఒక్కరి ఓటూ జాబితా నుంచి తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం బూత్‌ లెవెల్‌ ఏజెంట్స్‌(బీఎల్‌ఏ)లకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు గురువారం స్థానిక ఎమ్మార్‌ ఫంక్షన్‌ హాల్లో జరిగింది. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, ఆ పార్టీ రాష్ట్ర పోలింగ్‌ బూత్‌ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకర్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్నినాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న బీఎల్వోలు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్‌ సీపీ కి చెందిన బీఎల్‌ఏలు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పని చేయాలన్నారు. గన్నవరం శాసనసభ్యుడు గతాన్ని మరిచి కూటమి అధినాయకుల మెప్పు కోసం విమర్శలు చేస్తున్నారని.. ప్రత్యక్ష ఎన్నికల్లో తాను ఉండనని స్పష్టం చేశారు.

డీఎస్సీపై ఆధారాలు చూపగలరా..

డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు జరగలేదని బుకాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ సాక్ష్యాలను బయట పెట్టే దమ్ము ఉందా అని పేర్ని నాని సవాల్‌ విసిరారు. స్పోర్ట్స్‌ కోటాలో 65అంశాలకు సంబంధించి అమ్మకాలు జరిపిన కూటమి ప్రభుత్వం అర్హులైన డీఎస్సీ అభ్యర్థులను మోసగించిందన్నారు. వారందరూ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్న విధానం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, దారుణాలు జరిగితే నోరు మెదపని హోం మంత్రి వంగలపూడి అనిత.. సీఎం తనయుడు మంత్రి లోకేష్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం మీడియా ముందు ప్రత్యక్షమవుతున్నారన్నారు.

ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సులో మాజీ మంత్రి పేర్ని నాని

Advertisement
 
Advertisement
Advertisement