నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల తయారీ | - | Sakshi
Sakshi News home page

నాసిరకం ప్రెజర్‌ కుక్కర్ల తయారీ

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

పలు కంపెనీలపై బీఐఎస్‌ అధికారుల విస్తృత దాడులు భారీగా నకిలీ కుక్కర్లు సీజ్‌

గన్నవరం: మండలంలోని సూరంపల్లితో పాటు విజయవాడ కబేళాలోని అల్యూమినియం కంపెనీల్లో గురువారం భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌) అధికారులు దాడులు నిర్వహించారు. బీఐఎస్‌ విజయవాడ శాఖ శాస్త్రవేత్త, సంయుక్త సంచాలకులు షణ్ముఖ శివపల్లి, ఉప సంచాలకులు డి. వివేక్‌వర్థన్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఎ. రాజే నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సూరంపల్లిలోని అల్యూమినియం కంపెనీలో బీఐఎస్‌ లైసెన్స్‌ లేకుండా, ఐఎస్‌ఐ మార్కు లేకుండా ప్రెజర్‌ కుక్కర్లు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా తయారైన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న 7,598 కుక్కర్లను సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో మరో కంపెనీ..

అదే విధంగా విజయవాడలోని కబేళా ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఉన్న మరో కంపెనీలో తనిఖీలు నిర్వహించి నకిలీ ఐఎస్‌ఐ మార్కు ఉన్న ప్రెజర్‌ కుక్కర్లు, విడి భాగాలను తయారు చేస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించి తయారు చేసిన 478 ప్రెజర్‌ కుక్కర్లు, 418 కుక్కర్‌ బాడీలు, మరో వంద మూతలను స్వాధీనం చేసుకున్నారు. బీఐఎస్‌ శాస్త్రవేత్తలు, సంయుక్త సంచాలకులు బి. రాజగోపాల్‌, టి. అర్జున్‌, కె. సాయికౌషిక్‌ తదితరులు పాల్గొన్నారు. సదరు కంపెనీ నిర్వాహకులపై బీఐఎస్‌ చట్టం 2016 ప్రకారం చట్టపరమైన చర్యలతో పాటు జారిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement