వైఎస్సార్ సీపీ శ్రేణులపై కయ్యానికి కాలు దువ్విన వైనం విగ్రహాలకు వేసిన దండలు తెంచేసి రెచ్చగొట్టే ప్రయత్నం
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరుగుతుండగా వీరంగం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు నిరసన కార్యక్రమానికి ముందే పోలీసు అనుమతులు తీసుకున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చూడాలన్న వారి సూచన మేరకు కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ ర్యాలీ జరుగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆ పార్టీ జెండాలు చేత పట్టుకుని రెండేళ్ల విజయోత్సవం అంటూ పోటీగా ర్యాలీ ప్రారంభించారు. దీంతో ఇరు పార్టీలకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు రూట్ మ్యాప్ ఇస్తే దానినీ తెలుగు తమ్ముళ్లు ఉల్లంఘించారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమం జరిగే ప్రాంతానికి దూసుకొచ్చి రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు.
చోద్యం చూసిన పోలీసులు..
పోలీసులు అప్రమత్తమై ఇరుపక్షాలకు నచ్చజెప్పే యత్నం చేశారు. అయినా వినని టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులకు నచ్చ చెప్పి అక్కడ నుంచి పంపేశారు. టీడీపీ నాయకులు మాత్రం జ్యోతీరావ్ పూలే–సావిత్రీబాయ్ పూలే విగ్రహాలకు అప్పటికే వైఎస్సార్ సీపీ శ్రేణులు వేసిన పూలమాలలు తెంచివేసి వారు తెచ్చిన పూలమాలలను వేయడం అధికార మదానికి పరాకాష్టగా నిలిచింది. ఇంత జరుగుతున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.


