కృష్ణాజిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి
పామర్రు: ఎరువుల పంపిణీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన సర్వర్ విధానంతో రైతులకు ఎంతో ప్రయోజనం సమకూరుతుందని జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిరమణి పేర్కొన్నారు. స్థానిక బొమ్మారెడ్డి సీతారెడ్డి కల్యాణ మండపంలో జిల్లా స్థాయిలో సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ మండల అధికారులు, వీఏఏలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన ఎరువుల సరఫరా విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా రైతాంగానికి కావాల్సిన ఎరువులను అందించాలన్నారు. ఎరువుల సర్వర్ విధానంతో పాటుగా ఫెర్టిలైజర్ యాప్‌ను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, దానిని ఏ విధంగా వినియోగించాలని అనే అంశాలను వివరించారు.
ప్రతి రైతు నమోదు చేసుకోవాలి..
గుంటూరు ఎరువుల వ్యవసాయ కమిషనర్ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్రికల్చర్ ఎం. ఆనంద్‌రావు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ యాప్‌లో ప్రతి రైతు నమోదు అయి ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెఫెడ్ డీసీవో కె. చంద్రశేఖర్, జిల్లా మేనేజర్ బి. మురళీ కృష్ణ, డీడీఏ ఏ ఆనందరావు, రాష్ట్ర ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పామర్రు ఏడీఏ బి.స్వర్ణలత, ఏవో శివ నాగరాణి, జిల్లాలోని వీఏఏలు, పీఏసీఎస్ కార్యదర్శులు పాల్గొన్నారు.


