రూ.20 లక్షల సొత్తు అపహరణ
గన్నవరం: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ.20 లక్షల విలువైన సొత్తును అపహరించుకుపోయిన సంఘటనపై ఆత్కూరు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గన్నవరం మండలంలోని మెట్లపల్లి గ్రామానికి చెందిన వీరంకి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన బుధవారం ఇంటికి తాళం వేసి తన భార్యతో కలిసి మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో ఉంటున్న తమ కుమారై వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడి బీరువాలోని రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను, కొంత నగదును అపహరించుకుపోయారు. చోరీ విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరావు ఆత్కూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గూడూరు: మండలంలోని ఆకులమన్నాడులో వాటర్‌ప్లాంట్‌కు నీటి కోసం వచ్చి మహిళ మెడలో బంగారు నానుతాడు తెంచుకుని పరారైన దుండగులను ఎట్టకేలకు గూడూరు పోలీసులు పట్టుకున్నారు. గత ఏప్రిల్ 19న గూడూరు మండలం ఆకులమన్నాడులోని వాటర్‌ప్లాంట్‌కు నీటి క్యాన్‌కోసం వచ్చిన ఇద్దరు దుండగులు వాటర్‌ప్లాంట్ నిర్వాహకురాలి మెడలో నానుతాడు తెంచుకుని పరారయ్యారు. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన జిల్లా ఎస్పీ వి.విద్యాసాగరనాయుడు ఆదేశాల మేరకు బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు, పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్ టీం ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన గూడూరు ఎస్‌ఐ చల్లపల్లి దివ్యప్రకాష్ భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన దేవర నాగేశ్వరరావు(30), మొగల్తూరు గ్రామానికి చెందిన నెల్లూరు సాయి దుర్గాప్రసాద్(29)లను పట్టుకున్నారు. వారి నుంచి రెండు కేసులకు సంబంధించి మొత్తం 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విజయవాడలీగల్: పెనమలూరు మండలం, చోడవరం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ మాలపాటి విజయభాస్కరరెడ్డిపై ఉన్న బెయిల్ షరతులను తొలగిస్తూ గురువారం రెండవ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి నెట్టెం రాధిక ఉత్తర్వులు జారీచేశారు. విజయభాస్కర్‌రెడ్డి లండన్‌లో ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌లపై అనుచిత పోస్టులు పెట్టారనే అభియోగంపై 2025 నవంబరు 2వ తేదీన ఆయన్న అరెస్ట్ చేశారు. ఆయన భార్య, ముగ్గురు సంతానం లండన్‌లోనే ఉన్నారు. తన తండ్రి అంత్యక్రియల నిమిత్తం గత సంవత్సరం నవంబరులో చోడవరం వచ్చిన సందర్భంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేస్తూ, విదేశాలకు వెళ్లకుండా షరతు విధించారు. విజయభాస్కరరెడ్డి కుటుంబసభ్యులు లండన్‌లో ఉన్నందున, అక్కడ వ్యాపారాలు కూడా ఉన్నందున లండన్ వెళ్లేందుకు బెయిల్ షరతులను తొలగించాలని కోరుతూ ఆయన తరఫున వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదోపవాదనల అనంతరం బెయిల్ షరతులను తొలగిస్తూ పోలీసు అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని ఆదేశాలలో పేర్కొంటూ లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అదేవిధంగా పెనమలూరు పోలీసులు అరెస్టు చేసే సమయంలో ఎన్‌ఆర్‌ఐ మాలపాటి విజయభాస్కరరెడ్డి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారనే అభియోగంపై అరెస్టయిన కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను ఆరవ అడిషనల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయ మూర్తి లెనిన్‌బాబు మంజూరుచేశారు.


