మచిలీపట్నంఅర్బన్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులు, సింగిల్ టీచర్ స్కూళ్ల ఉపాధ్యాయులు, మెగా డీఎస్సీలో నియమితులైన మొత్తం 1,270 మంది ఉపాధ్యాయులకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఏడు శిక్షణ కేంద్రాల్లో జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. మచిలీపట్నంలోని మున్సిపల్ పార్క్ గర్‌ల్స్ హైస్కూల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ సుబ్బారావు సందర్శించి పరిశీలించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి (సౌత్) శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి–2 గురుప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు ఇందిరాదేవితో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన తలసేమియా వ్యాధిగ్రస్తుడు చాగంటిపాటి వివేక్‌కు గురువారం కలెక్టర్ డీకే బాలాజీ ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పమిడిముక్కల మండలం పర్యటన నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లోని బసవతారకం వైద్యశాలలో ఉచితంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేందుకు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ముందుగా డోనార్ స్పెసిఫిక్ యాంటిజెన్ (డీఎస్‌ఏ) పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటికి అయ్యే ఖర్చు రూ.35 వేలు జిల్లా డిసిప్లీనరీ కమిటీ పరిధిలోని పెనాల్టీ రుసుము నుంచి కలెక్టర్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్ ఆయన చాంబర్‌లో వివేక్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్‌కుమార్, పమిడిముక్కల పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ సైనా, వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


