ఘటనను నీరుగార్చాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్న చైర్‌పర్సన్ సమాచారం మీడియాకు వెల్లడించని కేడీసీసీబీ అధికారులు
కోడూరు: మండలంలోని వి.కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో అనుమతులు లేకుండా జిప్సం నిల్వలు ఉంచిన వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా నిల్వ చేసిన జిప్సంను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాలని పీఏసీఎస్ చైర్‌పర్సన్, జనసేన నేత రేపల్లె పిచ్చేశ్వరరావు సొసైటీ సీఈఓపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమ జిప్సం నిల్వలను గుర్తించి సంబంధిత రికార్డుల్లో ‘స్టాప్ సేల్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని డీసీసీబీ జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణించి, అవనిగడ్డ సబ్ డివిజన్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.నాగమల్లేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు సొసైటీలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. సంఘటనకు సంబంధించిన పలు పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు, జిప్సం నిల్వలకు సంబంధించిన వివరాలను నాగమల్లేశ్వరరావు పరిశీలించారు.
నీరుగార్చే ప్రయత్నం...
ఇదిలా ఉండగా జిప్సం అక్రమ నిల్వల వ్యవహారంలో జరిగిన ఘటనను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సొసైటీ సీఈఓ తోట శ్రీకాంత్‌ను కొందరు కూటమి పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పిచ్చేశ్వరరావు జనసేన నేత కావడంతో అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో విషయాన్ని తారుమారు చేసేందుకు విచారణ అధికారి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సంఘ పరిధిలోని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు సబ్సిడీపై అందాల్సిన జిప్సంను చైర్‌పర్సన్ బ్లాక్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించేందుకు కేడీసీసీ బ్యాంక్ అధికారులు నిరాకరించారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని, నివేదికను డీసీసీబీ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.


