ఈదురుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షం
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలు,
పొక్లెయిన్ సీజ్ కంచికచర్ల: ప్రభుత్వ అనుమతులు లేకుండా కృష్ణానది, మునేరు, కట్టలేరు, వైరా ఉపనదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపరాదని, ఒకవేళ తవ్వకాలు జరిపితే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని నందిగామ రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు హెచ్చరించారు. కీసర మునేటిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌తో పాటు రెండు లారీలను గురువారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకం మాటున కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో తనిఖీలు చేసి పట్టుకున్నామన్నారు. పట్టుకున్న లారీలు, పొక్లెయిన్‌ను రెవెన్యూ కార్యాలయానికి తరలించి వారికి అప్పగించామని చెప్పారు. తనిఖీల్లో ఎస్‌ఐ పి.విశ్వనాథ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెగిపడిన విద్యుత్ స్తంభాలు నిలిచిన రాకపోకలు
పమిడిముక్కల: మండలంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారిపై మంటాడ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టు విద్యుత్ స్తంభాలపై పడంటంతో అవి విరిగిపోయి, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందిన వెంటనే విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఎస్‌ఐ శ్రీను సిబ్బందితో వెళ్లి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించారు. ఇదిలావుండగా మంటాడ బైపాస్‌లో ఓ హోర్డింగ్ నేలకొరిగింది.