‘సర్‌’ తో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ తో అప్రమత్తంగా ఉండాలి

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

గుడివాడ టౌన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) విషయంలో అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. మంగళవారం స్థానిక కె– కన్వెన్షన్‌లో నియోజకవర్గ బూత్‌ కన్వీనర్‌లు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ సర్‌ పేరుతో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి దొడ్డిదారిన అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన నియోజకవర్గంలో సర్‌ పేరుతో 45వేల ఓట్లు తొలగించడంతో ఆయన ఓటమి పాలయ్యారన్నారు. పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ 15 ఏళ్లు నిరవధికంగా ముఖ్యమంత్రిగా చేశారని, ఆమె పక్క నియోజకవర్గం నుంచి అక్కడకు వచ్చి పోటీచేసిన వ్యక్తిపై ఓటమి పాలవడం గమనార్హమని అన్నారు. అక్కడ సైతం సర్‌ పేరుతో సుమారు 50వేలు పైబడి ఓట్లు తొలగించడమే కారణంగా కనిపిస్తోందని చెప్పారు. రానున్న పంచాయతీ, మండల, మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో సర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారని, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఎల్‌ఓలు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్‌ సీపీ కుటుంబ సభ్యులు దీనిని ఒక చాలెంజ్‌గా తీసుకుని దృష్టి పెట్టాలన్నారు.

మ్యాపింగ్‌ చేయించాలి..

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ సర్‌ పరిశీలనలో ఓటర్‌ లిస్ట్‌లో మ్యాపింగ్‌ అయిన వారి పేర్లు తొలగించాలంటే సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న సమాచారం మేరకు సుమారు 50 వేల నుంచి 60వేల మంది మ్యాపింగ్‌ కావలసి ఉందన్నారు. ఓటరుగా నమోదై మ్యాపింగ్‌ చెయ్యకపోతే తొలగింపును ప్రశ్నించడానికి అవకాశం ఉండదన్నారు. ప్రతి కార్యకర్త ఓటరు జాబితాను పరిశీలించి ఇంటింటికీ తిరిగి మ్యాపింగ్‌ కాని వారిని మ్యాపింగ్‌ చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ వారు మీ ఓట్లు తొలగిస్తారు తమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారని, కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌, బీఎల్‌ఓలతో సహా అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంట్రోల్‌లో ఉంటారని, అలాంటప్పుడు వైఎస్సార్‌ సీపీ వారు ఓట్లు తొలగిస్తారని అనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో సర్‌ ఉమ్మడి కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్‌ వరికూటి అశోక్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవీ నారాయణరెడ్డి, మచిలీపట్నం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సిలార్‌దాదా, గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడు రామిశెట్టి వెంకటేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు దుడ్డు చిన్నా, యువ నాయకుడు కొడాలి అర్జునరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ నియోజకవర్గ బూత్‌ కన్వీనర్లు, నేతల సమావేశంలో

మాజీ మంత్రి కొడాలి నాని

Advertisement
 
Advertisement
Advertisement