అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయటంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణాజిల్లా పరిధిలోని కృష్ణానదిలో జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కొరత లేకుండా చర్యలు..
వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 9 ఇసుక కేంద్రాల్లో (స్టాక్ యార్డులు) సుమారు 10లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన ఇసుకను 24 గంటల పాటు స్టాక్ యార్డుల నుంచి ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్టాక్ యార్డు ద్వారా టన్ను ఇసుకకు రూ. 155 చొప్పున ఏజెన్సీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. భూ గర్భవనరులశాఖ ఏడీ కొండారెడ్డి, డీపీవో ధనలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ సోమశేఖర్, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.


