సజావుగా ఎస్‌ఎస్‌సీ, ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

సజావుగా ఎస్‌ఎస్‌సీ, ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ఎస్‌ఎస్‌సీ, ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం సజావుగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం, ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో గణితం, భారతీయ సంస్కృతి–వారసత్వం, ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు మచిలీపట్నం పరిధిలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షలకు నమోదైన 1,190మంది విద్యార్థుల్లో 773 మంది హాజరుకాగా, 417 మంది గైర్హాజరయ్యారని, హాజరు 64.96 శాతం నమోదైందని చెప్పారు. ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు నమోదైన 411 మంది విద్యార్థుల్లో 335మంది హాజరు కాగా, 76 మంది గైర్హాజరయ్యారన్నారు. హాజరు 81.51 శాతం నమోదైందని చెప్పారు. ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు నమోదైన 638 మందిలో 541 మంది హాజరు కాగా, 97 మంది గైర్హాజరయ్యారని, హాజరు 84.80 శాతం నమోదైనట్లు డీఈఓ సుబ్బారావు తెలిపారు.

ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలోని 38 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ పరీక్షల కన్వీనర్‌ ఎస్‌. సరళ కుమారి తెలిపారు. పరీక్షకు 4,314 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 3,836 మంది హాజరయ్యారని, 477 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. హాజరు 88.68శాతం నమోదైందన్నారు. ఈ పరీక్షకు సెట్‌ నంబర్‌–2 ప్రశ్నపత్రాన్ని వినియోగించినట్లు తెలిపారు. రెండో ఏడాది విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కెమిస్ట్రీ–2 పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు 1,886 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 1,204 మంది హాజరయ్యారని, 681 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. హాజరు 64 శాతం నమోదైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement