గత ప్రభుత్వంలో వారధి మంజూరు 20 నెలలు అయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం దివిసీమను సస్యశ్యామలం చేసే బండికోళ్లంక బ్యారేజ్‌దీ అదే స్థితి దీవుల అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ ప్రజల వేడుకోలు
నాటి హామీ.. ఏది సామీ?
అన్యాయం చేయొద్దు..
వారధి నిర్మించండి..
ఎదురుమొండి ప్రజల ఆశల వారధిపై సర్కారు తీరిది!
అవనిగడ్డ: ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాకుండా పాలకులు అడ్డుపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఎదురుమొండి వారధిని గత ప్రభుత్వం మంజూరు చేయించింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల దీవుల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రాత్రివేళలో ఏదైనా అత్యవసరమైతే పడవ దాటి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివిసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో బండి కోళ్లంక వద్ద కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపగా కూటమి ప్రభుత్వంలో దీని ఊసేలేదు.
ఎందుకంత కక్ష..
నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవుల్లో మూడు పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడి దీవుల్లో పదివేల మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ఈ దీవులకు వెళ్లాలంటే రహదారి సౌకర్యం లేదు. ఫంటు లేదంటే పడవపై కృష్ణానది పాయను దాటి వెళ్లాల్సిందే. అర్ధరాత్రి ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైనా, పురిటి నొప్పులు వచ్చినా పడవదాటి రావాల్సిన పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి దీవుల ప్రజలకు రహదారి మార్గం కల్పించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో మాట్లాడి వారధిని మంజూరు చేయించారు. రూ.109 కోట్లు నాబార్డు నిధులతో ఏటిమొగ – ఎదురుమొండి మధ్య వారధిని నిర్మించేందుకు 2022 ఏప్రిల్ 13న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీవో 101ని జారీ చేసింది. ఈ వారధి నిర్మాణానికి ఓ ప్రజాప్రతినిధి అడ్డుపడటం, ఇంతలో ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వం వారధి నిర్మాణ పనులు చేపట్టలేక పోయింది.
వారధి కోసం దీక్షకు సన్నద్ధం..
ఎదురుమొండి వారధి నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సన్నద్ధమవుతున్నారు. దీవుల ప్రజలను సమీకరించి వారధి కోసం వైఎస్సార్ సీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.
అధికారంలోకి వస్తే ఎదురుమొండి వారధిని నిర్మిస్తామని కూటమి నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులిద్దరూ జనసేన నేతలే కావడం గమనార్హం. అయినా అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఎదురుమొండి వారధి గురించి పట్టించుకోకపోవడం పట్ల దీవుల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమాలు చేస్తే హైజాక్ చేయడం, తన తండ్రి పేరు పెట్టుకోవడం ప్రస్తుత ఎమ్మెల్యేకు కొత్తేమీ కాదు. గతంలో పులిగడ్డ – పెనుమూడి వారధి విషయంలో ఇదే చేశారు. ఇప్పుడు ఎదురుమొండి వారధిని నిర్మించి మీ ఇష్టం వచ్చిన వారి పెట్టుకోండి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ వారఽధి నిర్మాణాన్ని అడ్డుకుని దీవుల ప్రజలకు అన్యాయం చేయొద్దు.
– సింహాద్రి రమేష్‌బాబు,
మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ
ఎదురుమొండి దీవులకు వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో వారధి కోసం రూ.109 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అధికారంలోకి వస్తే ఎదురుమొండికి వారధిని నిర్మిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వారధి ఊసేలేదు. ప్రభుత్వం స్పందించి వారధి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.
– నాయుడు వెంకటేశ్వరరావు, ఎదురుమొండి


