మహిళా సంఘాలకు రూ.7 కోట్ల రుణాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు రూ.7 కోట్ల రుణాలు పంపిణీ

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: మహిళా సంఘాల ద్వారా పొదుపు, పరస్పర సహకారం, ఉపాధి అవకాశాల సృష్టితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ హరహరనాఽథ్‌ అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలోని ఏపీ గ్రామీణ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రూ.7 కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ జె.జుమ్మిలాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.6.50 కోట్లు, పశుసంవర్థక రుణాలు రూ.30 లక్షలు, లఖ్‌ పతి దీదీ పథకం కింద రూ.20 లక్షల రుణాలను ఆయన చేతుల మీదగా పంపిణీ చేశారు. మహిళా సంఘాలు రుణాలు పొంది విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ హర హరనాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ జె.జుమ్మిలాల్‌ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి మార్గాలను విస్తరించటం ద్వారా మరింత ఆర్థిక పరిపుష్టి సాధించగలరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు గుడివాడ రీజనల్‌ మేనేజర్‌ కె.ఆంజనేయులు మాట్లాడుతూ రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ, విద్యా, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందని చెప్పారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్‌ మధు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాస్‌, బ్యాంకు వీర వల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement