ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు వడదెబ్బకు వృద్ధురాలు మృతి కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం గురుకులాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

పెనమలూరు: కానూరులో యోగా శక్తి సాధనసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్‌ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కానూరు అశోక్‌నగర్‌ ఇండియన్‌ ఓం కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వైద్య కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముఖ్యంగా నొప్పులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, పిఠాపురం, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు 9000347369కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలని మాకాల సత్యనారాయణ సూచించారు.

గంపలగూడెం: మండలంలోని గాదెవారిగూడెం గ్రామానికి చెందిన రావూరి వెంకమ్మ(80) వడ దెబ్బకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకమ్మ గురువారం భానుడి తాపానికి గురై అనారోగ్యం పాలయ్యారు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృతురాలికి ఐదుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద మృతదేహం ఉన్నట్లు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమందింది. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కనపడలేదు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో 2025–26లో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సత్కరించి పురస్కారాలను అందజేశారు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి హాజరై మాట్లాడారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంట ర్మీయెట్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి సాధించిన 165 మంది రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులను, 132 మంది హాస్టల్‌ విద్యార్థులను సన్మానించామని తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను అందిపుచ్చుకుని తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలుతోపాటు వరుసగా రూ.20వేలు, 15వేలు, 10 వేలు చెప్పున నగదు బహుమతులు అందజేశారు. అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో విశేష కృషి చేసిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ ఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ బి. లావణ్యవేణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement