వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే! | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే!

May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM

పథకం ప్రకారం మహిళ హత్య కేసును ఛేదించిన గన్నవరం పోలీసులు నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగలు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

కోనేరుసెంటర్‌: గన్నవరంలో కలకలం రేపిన ఒంటరి మహిళ హత్యను పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. శుక్రవారం కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు

ఒంటరిగా ఫ్లాట్‌లో..

గన్నవరం దావాజీగూడెంకు సమీపంలోని జీకేఆర్‌ పారడైజ్‌ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ నంబర్‌ 401లో కాజ రజిత (55) అనే మహిళ ఒంటరిగా జీవిస్తోంది. భర్త ఇటీవల చనిపోవటంతో కాలక్షేపానికి చీటీల వ్యాపారంతో పాటు పిండి మర నడుపుకొంటూ కాలం గడుపుతోంది. ఆమె ఇద్దరు కుమార్తెలు కాగా.. ఇరువురు అమెరికాలో ఉంటున్నారు.

అడ్డుగా ఉందని..

గన్నవరం మండలం శ్రీనగర్‌కాలనీకి చెందిన పోలవరపు సుష్మ మృతురాలి వద్ద చీటీలు వేస్తూ ఉంటుంది. రజిత నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తితో సుష్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతన్ని కలిసేందుకు తరచూ అపార్ట్‌మెంట్‌లోకి వెళుతూ ఉండేది. దీనిని గమనించిన రజిత సుష్మను మందలిస్తూ వస్తోంది. దీంతో సుష్మ రజితను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని, తన కుమారుడు పోలవరపు అజయ్‌కుమార్‌ సాయం తీసుకుంది. అజయ్‌కుమార్‌ గతంలో అనేక నేరాలకు పాల్పడటంతో అతనిపై ఉయ్యూరు పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌షీట్‌ ఉంది. ఈ నెల 24వ తేదీ రాత్రి రజిత ఇంటికి వెళ్లి కాలింగ్‌ బెల్‌ కొట్టారు. అమెరికాలోని కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతున్న రజిత ఫోన్‌ కట్‌ చేసి, తలుపులు తెరవగా తల్లీకొడుకులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. చీటీల విషయమై మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమెను దిండితో బలంగా నొక్కి హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న సుమారు 390 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 1,60,000 నగదును అపహరించారు.

సీసీ ఫుటేజీల ఆధారంగా..

అమెరికాలోని కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతూ కట్‌ చేసిన రజిత ఎంత సేపటికీ కుమార్తెకు తిరిగి ఫోన్‌ చేయలేదు. కుమార్తె ఎన్ని సార్లు ఫోన్‌ చేసి తీయలేదు. మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వెళ్లి చూడగా రజిత శవమై కనిపించింది. దీంతో పనిమనిషి సమీపంలోని రజిత బంధువులు గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఆమెది హత్యగా భావించి తల్లీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం తల్లీకొడుకులు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ ఎల్‌. రమేష్‌, ఎస్‌ఐలు కె. శ్రీధర్‌, ఎం. నాగరాజు, ఎన్‌. ప్రశాంతిలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో జిల్లా అడిషనల్‌ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి. సత్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement