వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
పమిడిముక్కల: విద్యుత్ షాక్‌కు గురై ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత(17) మృతి చెందిన ఘటన శుక్రవారం లంకపల్లిలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన అంకిత స్నానం చేసేందుకు లంకపల్లి మెయిన్ పాఠశాల వద్ద పంపు వద్దకు నీటి కోసం వెళ్లింది. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంపుపై చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. ఇది గమనించని అంకిత నీరు పట్టేందుకు ప్రయత్నించగా.. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కర్రలతో విద్యుత్ వైర్లను పక్కకు జరిపి చూడగా అప్పటికే అంకిత మృతి చెందింది. దీంతో అంకిత తల్లిదండ్రులు ఇశ్రాయేలు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూలీపనులు చేసుకొంటూ కుమార్తెను చదివించుకొంటున్నామని ఆవేదన చెందారు. అంకిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఎన్‌ఐ బి.శ్రీను, విద్యుత్ ఏడీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు ఏడీ సుందరరావును కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.
పెనమలూరులో మరో యువకుడు మృతి
పెనమలూరు: చెత్త సేకరించి అమ్ముకునే యువకుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పటమట జేడీనగర్‌కు చెందిన ఏసురాణి, కొండయ్యలకు ముగ్గురు పిల్లలు. వారి కుమారుడు చల్లా శ్రీను(17)తో కలిసి చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఏసురాణి, కొండయ్య చెత్త సేకరణ కొసం రామవరప్పాడుకు వెళ్లగా శ్రీను కానూరు కొత్త ఆటోనగర్‌కు వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12గంటలకు చెత్త కొట్టు యజమాని ఏసురాణికి ఫోన్ చేసి కొత్త ఆటోనగర్ రెండో లైన్‌లో కరెంట్ ఆఫీస్ పక్కన శ్రీను చనిపోయి ఉన్నాడని సమాచారం తెలపటంతో ఘటనా స్థలం వద్దకు ఏసురాణి, భర్త కొండయ్య వెళ్లారు. డ్రెయినేజీలో విద్యుత్ తీగలు పడి ఉండగా ప్రమాదవశాత్తూ శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఏసురాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


