చిలకలపూడి(మచిలీపట్నం): జలజీవన్ మిషన్ పథకం ద్వారా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయటంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోడూరు మండలంలో అత్యధికంగా పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయా మండలాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. టాయిలెట్లలో టైల్స్, కమోడ్లు, స్టీలు కుళాయిలు, సరిపడా వెంటిలేషన్ తదితర సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ పనులను చేపడతామన్నారు. త్వరలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి సంబంధిత పనులను స్వయంగా పరిశీలిస్తామన్నారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వహణాధికారి సోమశేఖర్, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్, డీపీవో ధనలక్ష్మి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కృష్ణా జిల్లా
కలెక్టర్ బాలాజీ ఆదేశం


