మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇందన పొదుపు అందరి బాధ్యతని దీనికి ఈవీ వాహనాలు వినియోగించాలని ఏపీసీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సూచించారు. ఏపీసీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం ఇంధన పొదుపులో భాగంగా హనుమయ్య, డివిజన్ ఈఈ కావేటి కొండలరావు, డెప్యూటీ ఈఈ పుప్పాల శ్రీధర్, సూర్యారావుపేట సెక్షన్ ఏఈ బొడ్డపాటి వెంకట్రావుతో కలసి ఈవీ ద్విచక్రవాహనాలు, సైకిల్‌పై వచ్చి మాచవరం విద్యుత్ సబ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు చేయడంతో పాటు వాడకం తగ్గించడానికి సూర్యఘర్ పథకం కింద విద్యుత్ వినియోగదారులు సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని సూచించారు. సూర్యఘర్‌తో ప్రభుత్వం రూ. 78 వేలు రాయితీ ఇస్తుందని..ఎస్సీ, ఎస్టీలకు సోలార్ కనెక్షన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మాచవరం విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బందికి సూచనలు చేశారు. ఇన్‌స్పెక్షన్ అనంతరం తిరిగి సర్కిల్ కార్యాలయానికి ఈవీ ద్విచక్రవాహనాలు, సైకిల్ మీద వెళ్లారు.


