పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్
గణతంత్ర వేడుకలో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ డీకే బాలాజీ
15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక ప్రకటన
ఆలోచింపజేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రపంచంలో భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనం బాధ్యతగా కాపాడుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసుల మార్చ్‌ఫాస్ట్, పరేడ్‌ను పరిశీలించారు. తరువాత కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. జాతీయజెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, కృష్ణాపత్రిక స్థాపించిన ముట్నూరు కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు మన జిల్లా వారు కావటం ఎంతో గర్వకారణమన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ లక్ష్యసాధనకై జిల్లాలో రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కనీసం 15 శాతం వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని వినూత్నంగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 78,866 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని వీరిలో ఇప్పటి వరకు 43,496 కుటుంబాల వారిని 2,865 మంది మార్గదర్శకులు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు.
వ్యవసాయ రంగంలో సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించే దిశగా ఆధునిక వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
మత్స్యకారులకు గ్రీన్ క్లయిమెట్ ఫండ్ ద్వారా జిల్లాకు 27 యూనిట్లు మంజూరయ్యాయని, ఒక్కొక్క యూనిట్‌కు రూ.19,500 చొప్పున లబ్ధిదారులకు పీత పిల్లలు సరఫరా చేశామన్నారు.
ఆక్వా ఎక్స్‌చేంజ్ ఆధ్వర్యంలో వినూత్నంగా ఆక్వా కల్చర్‌లో డిజిటల్ ట్రేసబులిటీపై నిర్వహిస్తున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని నందివాడ మండలంలో ఆరు గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇచ్చామన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించటంతో పాటు విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు కూడా ఉత్తమ మార్కులు సాధించేలా చర్యలు చేపట్టామన్నారు.
ఉపాధి హామీ పథకంలో 54.19 లక్షల పనిదినాలు కల్పించి రూ. 152.36 కోట్లు కూలీగా అందజేశామన్నారు. గ్రామీణ రహదారులు పటిష్ట పరిచేందుకు సాస్కీ గ్రాంటు ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు దరఖాస్తులు చేసుకునే వారికి సింగిల్ విండో ద్వారా మంజూరు చేసి పరిశ్రమలు నెలకొల్పటంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
రెవెన్యూశాఖ ద్వారా ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు, ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తం 21 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయగా.. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రదర్శనశాలలను తిలకించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల రహిత ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్‌కు ప్రథమస్థానం లభించింది. అలాగే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరిలో మేలైన వ్యవసాయ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల రెండో స్థానం, గన్నవరం డెప్యూటీ తహసీల్దార్ ఎస్. భవానీ ఏర్పాటు చేసిన చిత్రలేఖనం ప్రదర్శనశాల మూడో స్థానం దక్కించుకుంది
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి ప్రభోదాత్మక గీతాలకు ప్రదర్శించి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావాన్ని పెంపొదించటంతో పాటు దేశ సమగ్రతను చాటి చెప్పారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి పొందగా, ఎస్వీ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల ద్వితీయ, సెయింట్ జాన్స్ హై స్కూల్ తృతీయ బహుమతులను గెలుపొందారు. విజేతలకు కలెక్టర్ డీకే బాలాజి, ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ప్రదర్శనలో పాల్గొన్న మిగిలిన పాఠశాలలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు.
శకటాల ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. డీప్ టెక్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అనే సూత్రంపై విద్య, వైద్య శాఖలు ప్రదర్శించిన ఐటీ, ఏఐ, మనమిత్ర వాట్సాప్, 108, 104, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ శకటాల ప్రదర్శన అగ్రస్థానంలో నిలిచింది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ సూత్రంపై సాంఘిక సంక్షేమ శాఖ చేనేత జౌళీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెడన కలంకారీ చేనేత ఉత్పత్తులు అనుకరణ ఆభరణాల శకటానికి రెండో స్థానం, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పేదరికం లేని సమాజం(జీరో పావర్టీ) పీఫోర్ బంగారు కుటుంబాలు, గృహ నిర్మాణంపై ఏర్పాటు చేసిన శకటానికి మూడో స్థానం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు కలిసి బహుమతులను అందజేసి అభినందించారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి, సెల్యూట్ చేస్తున్న కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్
డీప్ టెక్


