భక్రిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య హవనం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరపరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10గంటలకు ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య హవనం నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్థానిక పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక పల్లకీలో స్వామివారిని ద్వాదశ ప్రదక్షిణలు జరిపించారు. అంతకుముందు రోజు ఆదివారం రాత్రి శమీవృక్ష పూజ నిర్వహించి, మయూర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ఎం. హరనాథ్ టెంకాయలు కొట్టి ప్రారంభించారు. డీఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
భక్రిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య హవనం


