తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం
విజయవాడ కల్చరల్: తెలుగు నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావా లని తపస్వి కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్తా ఆకాంక్షించారు. తపస్వి కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్రనాటక కళాసమితి, కొడాలి బ్రదర్స్, ఏపీ నాటక అకాడమీ, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో డాక్టర్ నందమూరి తారక రామారావు కళాపరిషత్ మూడు రోజులపాటు నిర్వహించే తొమ్మిదో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికోత్సవాలు సోమవారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ.. నాటకాలకు సామాజిక ప్రయోజనం ఉండాలన్నారు. తపస్వి కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి సూర్యదేవర జగన్నాథరావు మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా నాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రనాటక కళాసమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, హనుమంతరాయ గ్రంథాలయం అధ్యక్షుడు దోనేపూడి శంకరరావు, విశ్రాంత పోలీస్ అధికారి వేమూరి నాగేశ్వరశర్మ, కళాపోషకుడు గడ్డం సత్యనారాయణ పాల్గొన్నారు. నాటక రంగప్రముఖుడు, ప్రయోక్త డాక్టర్ కందిమళ్ల సాంబశివరావుకు తపస్వి కళాసేవా పురస్కారం ప్రదానం చేశారు. సభా ప్రారంభంలో హేమంత్ కుమార్ బృందం ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన అలరించింది. తొలి ప్రదర్శనగా కళానికేతన్ (వీరన్నపాలెం) బృందం ‘దీపం కింద చీకటి’ నాటిక ప్రదర్శించారు. ఆగస్య రచించిన ఈ నాటికకు వై.బి.చౌదరి దర్శకత్వం వహించారు. అనంతరం మల్లీశ్వరి ఆర్ట్స్ (హైదరాబాద్) కళాకారులు ‘నువ్వోసగం – నేనో సంగం’ నాటిక ప్రదర్శించారు. పి.భవానీప్రసాద్ రచించిన ఈ నాటికకు పోలిమెట్ల సుబ్బారావు దర్శకత్వం వహించారు.


