భక్తుల కల్పవల్లి.. వీరమ్మతల్లి
ఉయ్యూరు: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల ఈనెల 28న ప్రారంభం కానుంది. ఏటా మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన మొదలై 15 రోజులు పాటు ఈ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరునాళ్లను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
మెట్టినింటి నుంచి బయలుదేరనున్న అమ్మవారు..
శ్రీ పారుపూడి కనక చింతయ్య సమేతంగా అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరటంతో తిరునాళ్లకు అంకురార్పణ జరుగుతుంది. ఈనెల 28వ తేదీ రాత్రి 8.30గంటల ప్రాంతంలో అమ్మవారికి పారుపూడి, నెరుసు వంశస్తులు ఆచారం ప్రకారం పూజా కార్యక్రమాలు జరిపిస్తారు. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు పట్టణ పోలీసుస్టేషన్ అధికారి దంపతులు స్టేషన్‌లో పూజలు నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా మెట్టినింటికి తరలివెళ్లి తొలి పసుపు కుంకుమ, చీర సారె సమర్పించటంతో తిరునాళ్ల ప్రారంభమవుతుంది. అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరగానే ఉపవాస దీక్షతో ఉన్న భక్తులు అంతా ఎదురుగండ దీప, తిరుగుడు గండ దీపాలతో హారతులు పట్టి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామోత్సవం పూర్తి చేసుకుని మరుసటి రోజు అమ్మవారు ఆలయ ప్రవేశం చేసి భక్తుల పూజలందుకుంటారు.
ఊయల ఉత్సవం, శిడి బండి వేడుక..
15 రోజులు పాటు సాగే తిరునాళ్ల మహోత్సవంలో ప్రధాన వేడుక ఊయల ఉత్సవం. అమ్మవారు గ్రామోత్సవం పూర్తి చేసుకున్న అనంతరం ప్రధాన సెంటరులోని ఊయల స్తంభం వద్ద ఊయల ఊగిన అనంతరం ఆలయ ప్రవేశం చేస్తారు. 11వ రోజు ఫిబ్రవరి 7న నిర్వహించే శిడిబండి ఉత్సవానికి భక్తులు పోటెత్తుతారు. ఉత్సవాల్లో జోడు పొట్టే ళ్లప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తిరునాళ్ల ఆఖరి రోజు పెద్ద ముఠా కార్మికుల ప్రభ బండి ఊరేగింపు ప్రత్యేకతను చాటుకుంటుంది.
ఏర్పాట్లపై సమీక్ష..
తిరునాళ్ల ఏర్పాట్లపై సోమవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ సురేష్‌కుమార్, సీఐ రామారావు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చర్చించారు. మెట్టినింటి నుంచి ఆలయం వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాల్సిన కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు.
శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లి
ఉయ్యూరులో రేపటి నుంచి అమ్మవారి తిరునాళ్లు
భక్తుల కల్పవల్లి.. వీరమ్మతల్లి


