బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం

May 8 2024 5:35 AM | Updated on May 8 2024 5:35 AM

బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం

బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బ్రాహ్మణ, ఆర్యవైశ్య సామాజికవర్గాలకు ఈ ఎన్నికల్లో దారుణమైన అన్యాయం చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఆయన తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి కుట్రపూరితంగా బ్రాహ్మణ ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా గమనించాలన్నారు. బీజేపీకి సంప్రదాయ ఓటర్లుగా ఉన్న బ్రాహ్మణులకు ఆర్యవైశ్యులకు కనీసం భారతీయ జనతా పార్టీ 16 సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం అన్యాయమన్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీకి అత్యంత ఆప్తుడైన, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి గురువుల్లో ఒకరైన పరిపూర్ణానంద స్వామీజీకి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శివస్వామికి బీజేపీ టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతా పార్టీలోని ఆయా సామాజికవర్గాలను పురందేశ్వరి ఎంత దారుణంగా అణగదొక్కారో స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నారు.

జగన్‌ ఎంతో చేశారు..

2019 నుంచి 2024 ఐదేళ్ల కాలంలో సీఎం జగన్‌ అర్చకుల రిటైర్మెంట్‌ విధానాన్ని రద్దు చేశారని, అర్చకుల వేతనాన్ని పెంపు అమలు చేశారని పోతిన అన్నారు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల్లో అర్చకులకు భాగస్వామ్యం కల్పించారన్నారు. రాష్ట్రంలో 5,046 ఆలయాలకు నిత్య ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించారు. చంద్రబాబు కూల్చేసిన అనేక ఆలయాలను విజయవాడ నగరంలో పునర్నిర్మించారన్నారు. కనకదుర్గమ్మ గుడిలో ఆలయ అభివృద్ధి కోసం రూ.200 కోట్ల పనులు చేపట్టారన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో రూ.175 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. వేల ఎకరాల దేవాలయాల భూముల వివాదాలను పరిష్కారం చేసినటువంటి గొప్ప వ్యక్తి సీఎం జగన్‌ అని వివరించారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి వైఎస్సార్‌ సీపీ పార్టీ కొన్ని కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులు వైఎస్సార్‌ సీపీకి అండగా ఉండాలని కోరారు. ఆలయాలను కూల్చే కూటమికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో నేమాల సంజీవరావు, అడ్డూరి తమ్మారావు, షేక్‌ అమీర్‌ భాష, మద్దెల కనకారావు, సాబిన్కర్‌ నరేష్‌, సీరం శీను బాబు, పిల్లా శంకర్‌ లండ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ 16 సీట్లలో ఒక్క సీటు కేటాయించలేదు సామాజిక న్యాయమని మాట్లాడే అర్హత కూటమికి లేదు వైఎస్సార్‌ సీపీ నేత పోతిన మహేష్‌

Advertisement
 
Advertisement
Advertisement