● తుది దశకు ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ ● ఇటీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హ యాంలో పురుడుపోసుకున్న ఈ ప్రాజెక్టును తాజా గా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదిక(డీపీఆర్) ఇవ్వడానికి ఇటీవల ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి తుది నివేదిక ఇవ్వనుంది. తాజాగా వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే ప్రాజెక్టు పనుల్లో వే గం పెరగనుంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తుది దశకు చేరినట్లుగా తెలు స్తోంది. ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ మేరకు తుది రూపం రానుంది. కొత్తగా నిర్మించబో యే ప్రాజెక్టుతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉంది. ఈ ప్రాంత రైతులకు ఏళ్లుగా సాగు నీరందక అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే స్థానిక రైతాంగానికి ఎంతో మేలు జరుగనుంది.
మైలారం మీదుగా టేకుమట్ల వాగులోకి..
ఇటీవల ప్రాజెక్టు నిర్మాణంపై డీపీఆర్ కోసం సర్వే చేసిన సమయంలో పలు అంశాలపై అధ్యయనం చేశారు. ప్రాణహిత నది నుంచి ఒకే లిఫ్టుతో 71 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉన్న కాలువల గుండా నెన్నెల మండలం మైలారం వరకు వినియోగంలోకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి గ్రావిటీతో 14కి.మీ. వరకు సొరంగ మార్గం తవ్వనున్నారు. ఆ కాలువను జైపూర్ మండలం టేకుమట్ల వాగుకు కలిపి అటు నుంచి గోదావరిలోకి తరలించనున్నారు. దిగువన సుందిళ్ల బ్యారేజీ ఉండడంతో గోదావరిలోనే నీటి నిల్వ ఉండే అవకా శం ఉంది. ఎక్కువ లిఫ్టులు లేకుండా గ్రావిటీతోనే పైనున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బదులు కింద సుందిళ్ల ప్రాజెక్టులోకి జలాలను తరలిస్తే సులువుగా ఉంటుందనే నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి పైనున్న కాళేశ్వరం బ్యారేజీ, పైనున్న సుందిళ్ల ప్రాజెక్టు నీటి నిల్వకు సముచితం కాదని ఎన్‌డీఎస్‌ఏ(నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) ఓ నివేదికలో పేర్కొంది. దీంతో ఆ బ్యారేజీలో నీటి నిల్వ ఎలా చేసి తరలిస్తారనే వాదన ఉంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణం నివేదికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏళ్లుగా సాగదీత
ఉమ్మడి రాష్ట్రంలో పదిహేడేళ్ల క్రితమే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అటు నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి వరకు నీటిని ఎత్తిపోస్తూ సాగు, తాగునీరు, పరిశ్రమలకు ఇచ్చేలా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా బ్యారేజీ నుంచి చింతలమానెపల్లి మండలం కర్జల్లి, బెజ్జూరు మండలం సురగలపల్లి, నెన్నెల మండలం మైలారంలో లిఫ్టులు ఏర్పాటు చేసి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని భావించారు. కానీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రాజెక్టుపై పట్టింపు కరువైంది. చివరికి ప్రాజెక్టును పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా, పెన్‌గంగా తదితర చోట్ల బ్యారేజీ నిర్మిస్తామని చెప్పనప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు రాకతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామనే హామీ మేరకు మళ్లీ కదలిక వచ్చింది.
● తుది దశకు ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ ● ఇటీ
● తుది దశకు ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టు డీపీఆర్ ● ఇటీ


