ఆసిఫాబాద్‌లో స్వతంత్రులే కీలకం
ఆసిఫాబాద్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. దీంతో హంగ్ అనివార్యమైంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని 50 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, జనసేన, సీపీఐతో పాటు స్వంతంత్రులు బల్దియాలో పాగా వేసేందుకు పోటీ పడ్డారు. హోరాహోరీ ప్రచారంతోపాటు భారీగా నగదు, మద్యం, నజరానాలు సమర్పించినా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 9 స్థానాలతో బీఆర్‌ఎస్ ముందంజలో ఉండగా, 7 స్థానాల్లో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు 11 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా, నాలుగు స్థానాల్లో గెలిచిన స్వతంత్రులు(కాంగ్రెస్ రెబల్స్) ఎటువైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. బల్దియా పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఒక ఓటుతోపాటు మరో ఒక కౌన్సిలర్ మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ మెజార్టీ మార్క్ దాటాలంటే వారికి తమ ఏడు స్థానాలతోపాటు నలుగురు స్వతంత్రుల మద్దతు తెలిపాలి. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థులు చేజారకుండా రెండు పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు.
స్వతంత్రులతో బేరసారాలు
మున్సిపాలిటీ పీఠాలను కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ముఖ్య నేతలు స్వతంత్ర అభ్యర్థులతో బేరసారాలు ప్రారంభించారు. మద్దతు కూడగట్టుకునేందుకు వారికి వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఇండిపెండెంట్లు ఏకంగా చైర్మన్, లేదా వైస్ చైర్మన్ పదవినే ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్ర ధాన పార్టీలు అయోమయంలో పడ్డాయి. జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి వినోద్‌కుమార్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా, కాంగ్రెస్ నేతలు ఆటోలో తరలించే ప్రయత్నం చేయగా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఆయన పెనుగులాట నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఆసిఫాబాద్ బల్దియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీలకు అస్పష్టమైన మెజార్టీ రావడం నిరాశ మిగిల్చింది. కాగజ్‌నగర్‌లో ఆయా పార్టీల ముఖ్యనేతలు బీజేపీ, స్వతంత్రులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఏ పార్టీల మధ్య పొత్తులు వికసిస్తాయో వేచి చూడాల్సిందే.
ఆసిఫాబాద్‌లో బోణీ కొట్టని కమలం
జిల్లా కేంద్రంలో బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. జిల్లా కేంద్రంలో ఆ పార్టీ ముఖ్యనేత అరిగెల నాగేశ్వర్ రావు, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే హరీశ్‌బాబు, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, ఇతర నేతలు అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. కానీ ఆశించిన సీట్లు దక్కించుకోలేకపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


