30 వార్డులు.. రెండు రౌండ్లు
ఫలితాలు వెల్లడిస్తున్న అధికారులు
బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఎస్పీ నితిక పంత్
చింతలమానెపల్లి/కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రశాంతంగా సాగింది. పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటులేకుండా ముగిసింది. కాగజ్‌నగర్ పట్టణంలోని డీఐఏ లక్ష్మిపత్ సింఘానియా పబ్లిక్ స్కూల్‌లో గల 8 గదుల్లో 72 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 36 మంది సూపర్‌వైజర్లు లెక్కింపును నిర్వహించారు. 30 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ప్రక్రియ పూర్తిచేశారు. ఒక్కో రౌండ్‌లో 15 వార్డుల చొప్పున మొదటి రౌండ్‌లో 1, 3, 5, 6, 8, 10, 12, 14, 16, 19, 21, 23, 25, 27, 29 వార్డులను లెక్కించగా, రెండో రౌండ్‌లో 2, 4, 7, 9, 11, 13, 15, 17, 18, 20, 22, 24, 26, 28, 30వ వార్డుల్లోని ఓట్లను లెక్కించారు. ఫలితాలు వెల్లడించేందుకు కేంద్రం ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా అధికారులు
కౌంటింగ్ నేపథ్యంలో ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ వహీదుద్దీన్ బందోబస్తును పర్యవేక్షించారు. అంచెలుగా భద్రత ఏర్పాటు చేశారు. ద్వారం వద్ద తనిఖీల కోసం బాంబు స్క్వాడ్‌ను నియమించి.. కేంద్రంలోకి వెళ్లే ప్రతీఒక్కరిని తనిఖీ చేశారు. లెక్కింపు ప్రక్రియను అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు.
ఆద్యంతం ఉత్కంఠ
ఓట్లలెక్కింపు కేంద్రంలోకి అధికారులు ఎలాంటి మొబైల్, ప్రసార సాధనాలు, ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించలేదు. అధికారులు ప్రకటించే వరకు, లేదా ఏజెంట్లు, అభ్యర్థులు బయటకు వచ్చే వరకు ఫలితాలు వెల్లడి కాలేదు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఐదు, బీఆర్‌ఎస్ 4, బీజేపీ 3, ఎంఐఎం 1, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ ఏడు స్థానాలు, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అల్లాడి దుర్గమ్మ సమీప బీజేపీ అభ్యర్థి అంబాల సుగుణపై 452 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మున్సిపాలిటీలో ఇదే అత్యధిక మెజార్టీ. 15వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతలపాణి విద్యావతి 4 ఓట్లు, 28వ వార్డు బీజేపీ అభ్యర్థి ఈర్త విశ్వేశ్వర్‌రావు ఐదు ఓట్లు, 29వ వార్డు బీజేపీ అభ్యర్థి వైద్యురాలు కొత్తపల్లి అనిత ఏడు ఓట్లు, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మాజీ శారద 10 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
30 వార్డులు.. రెండు రౌండ్లు


