పూర్వవైభవం దిశగా కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

పూర్వవైభవం దిశగా కాంగ్రెస్‌

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి జిల్లాకు అవసరమైన పరిశ్రమలు తెచ్చుకుందాం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేసిన డీసీసీ కార్యవర్గం

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవం దిశగా సాగుతుందని, 2028 ఎన్నికల లక్ష్యంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్స్‌లో శుక్రవారం ఏఐసీసీ సెక్రెటరీ సచిన్‌ శ్రవంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియామక పత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గం అందరినీ సమన్వయం చేసుకుంటూ.. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కార్యవర్గంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం లభించిందని తెలిపారు. జిల్లాలో అవసరమైన వనరులను గుర్తించి పరిశ్రమలు తెచ్చుకుందామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వం ఉంటే ఏ స్థాయిలోనైనా రాణించవచ్చని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతినెలా రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తుందన్నారు. పదేళ్లుగా ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణకు డీసీసీ పదవి దక్కిందని తెలిపారు.

వెన్నుపోటుతో చైర్మన్‌ పదవి కోల్పోయాం

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ తరుఫున గెలిచిన కొందరి వెన్నుపోటుతో చైర్మన్‌ పదవిని కోల్పోయామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నా రు. కొండాలక్ష్మణ్‌ బాపూజీ పుట్టిన జిల్లాలో బీసీల కు సుముచిత న్యాయం జరిగే అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుకు నామినేటెడ్‌ పోస్టు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, ఇతర మతాలను కలుపుకొని వెళ్లే పార్టీ కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు పీసీసీ అధ్యక్షుడిని సన్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, నియోజ కవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, డీసీసీ మాజీ అధ్యక్షు డు విశ్వప్రసాద్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు ఇరుకుల మంగ, విశ్వనాథ్‌, దేవయ్య, మాజీ ఎమ్మె ల్యే ఆత్కం సక్కు, నాయకులు మల్లేశ్‌, అబ్దుల్లా, తారీఖ్‌, బాలేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement