కాగజ్‌నగర్‌లో రోడ్లకు ఇరువైపులా అక్రమ కట్టడాలు ట్రాఫిక్ చిక్కులతో ప్రజలకు నిత్యం నరకం స్వచ్ఛందంగా తొలగించాలని మున్సిపల్ అధికారుల ప్రకటన
కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాలకు ఇరువైపులా కొందరు రోడ్లు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో సుమారు 70వేల జనాభా ఉంది. అక్ర మ నిర్మాణాలతో ఏళ్లుగా జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు, అంబులెన్స్‌లు దారుల్లో చిక్కుకుపోతున్నాయి. ఈ తరుణంలో యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఇది ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఆక్రమణలు ఇక్కడే..
పట్టణంలోని ప్రధాన మార్కెట్ ఏరియా, తెలంగా ణ తల్లి చౌరస్తా నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, భట్టుపల్లి చౌరస్తా, రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తాల మీదుగా సంజీవయ్య కాలనీ వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎల్లాగౌడ్ తోట ప్రభుత్వ ఆస్పత్రి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. వివిధ కాలనీల నుంచి మార్కెట్‌కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు రెండువైపులా దుకాణాలు నిర్మించగా, చిరువ్యాపారులు తోపుడు బండ్లు రోడ్లపైనే పెడుతున్నారు.
పెండింగ్‌లోనే తొలగింపు ప్రక్రియ
పట్టణంలో ఇప్పటికే గుర్తించిన అక్రమ నిర్మాణాల ను ఇంకా తొలగింపునకు నోచుకోవడంలేదు. పలు మార్లు ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుండడంతో పట్టణ ప్రజలు అసహనానికి గురవుతున్నారు. 2019 మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణంలోని ప్రజారవాణాలు, కాలువలు, ఫుట్‌పాత్‌లపై ఎటువంటి ఆక్రమణలు అనుమతించరాదు. అక్రమ నిర్మాణాన్ని తొలగించే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. నిర్ణీత గడువులోగా స్వ చ్ఛందంగా తొలగించకపోతే మున్సిపాలిటీ బలవంతంగా తొలగించే అధికారం సైతం ఉంటుంది. ప్రజ ల రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతుంది. అవసరమైతే జరిమానాల ఖర్చులను సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేయవచ్చు. ఇప్పటికై నా పట్టణంలోని ఆక్రమణలను పూర్తిగా తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


