ప్రతిపాదనలేనా! | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలేనా!

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

రైల్వే బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు అంచనా నిధులు రాక కొత్త పనులకు కలగని మోక్షం మంచిర్యాల నుంచి సిర్పూర్‌(టి) స్టేషన్ల దాక ఇదే తీరు తాజాగా పాతవాటికే మరోసారి రూ.కోట్లలో నిధులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వే బడ్జెట్‌లో గతేడాది తరహాలో దక్షిణ మధ్య రైల్వే పరిధి కాజిపేట–బల్లార్షా సెక్షన్‌కు మళ్లీ ప్రతిపాదనలు వచ్చాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలోని మంచిర్యాల, రామకృష్ణాపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్డు, ఆసిఫాబాద్‌ రోడ్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) వరకు ఉన్న లైన్‌లో అభివృద్ధి పనులకు రైల్వే రూ.కోట్లలో నిధులు ప్రతిపాదించింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌లో ప్రతిపాదించినా నిధులు ఖర్చుకు నోచుకోవడం లేదు. నిధులు విడుదల కాక పనులు నిలిచిపోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, తాజాగా రైల్వే కేటాయింపులపై వివరాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే పలు పెండింగ్‌ పనులకు మరోసారి బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

మంచిర్యాల నుంచి ఆదిలాబాద్‌ లైన్‌కు సర్వే

ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కలిగే మంచిర్యాల వయా ఉట్నూర్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు 186 కిలోమీటర్ల నిడివితో కొత్తగా రైల్వేలైన్‌ నిర్మాణం కోసం సర్వేకు రూ.100.28 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత రెండు బడ్జెట్‌ల్లోనూ కేటాయించినా అడుగు ముందుకు పడలేదు. ఇక రాఘవపురం, మందమర్రి మధ్య మూడో లైన్‌ పనుల కోసం గతంలో కేటాయించిన రూ.180 కోట్లు యధావిధిగా ఈ బడ్జెట్‌లో చేర్చారు. 4.37కి.మీ నిడివి గల మంచిర్యాల–పెద్దంపేట మూడోలైన్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది.

నాలుగో లైన్‌ కోసం సర్వే

ప్రస్తుతం కాజిపేట–బల్లార్షా మధ్య మూడో లైన్‌ పూర్తయింది. ఇక భవిష్యత్‌లో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా నాలుగో లైన్‌ కోసం కాజిపేట–బల్లార్షా మధ్య మొత్తం 234కి.మీ. సర్వే కోసం రూ.4.68కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్‌లోనూ ప్రతిపాదించారు. నాలుగోలైన్‌కు ట్రాఫిక్‌ సర్వే కోసం రూ.1.17కోట్లు, బెల్లంపల్లి యార్డులో మైక్రో టన్నెలింగ్‌ కోసం రూ.4కోట్లు, స్టేషన్‌లో వ్యాగన్ల నిర్వహణ కోసం సౌకర్యం కల్పించేందుకు రూ.14.12కోట్లు, సిర్పూర్‌ టౌన్‌ స్టేషన్‌ లోడింగ్‌లైన్‌ కోసం రూ.24.72కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌లో చేర్చినప్పటికీ విడుదల కాక పనులు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది.

ఆర్వోబీలు, ఓఆర్వోబీ..

కొత్తగా ఆయా స్టేషన్లు, రైల్వేలైన్ల పరిధిలో అండర్‌ బ్రిడ్జిలు, ఓవర్‌ బ్రిడ్జిల కోసం ఇక్కడి ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు పంపగా, బడ్జెట్‌లో చేర్చారు. వీటిలో రాళ్లపేట–బెల్లంపల్లి స్టేషన్ల మధ్య ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.5.90కోట్లు, రేపల్లెవాడ–ఆసిఫాబాద్‌ స్టేషన్ల మధ్య ఆర్‌యూబీకి ఏర్పాటుకు రూ.10.46కోట్లు, మందమర్రి మంచిర్యాల మధ్య రోడ్‌ అండర్‌ బ్రిడ్జి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రూ.9.65కోట్లు అంచనా వేశారు. ఆసిఫాబాద్‌ రోడ్‌ సమీపంలోనూ ఆర్వోబీ(రోడ్‌ఓవర్‌బ్రిడ్జి) కోసం రూ.40.48 కోట్లు అంచనా ఉంది. రాళ్లపేట–కాగజ్‌నగర్‌ మధ్య ఆర్‌యూబీ నిర్మాణానికి రూ.7.14 కోట్లు ప్రతిపాదించారు. కాగజ్‌నగర్‌–రాళ్లపేట మధ్య ఉన్న వంతెనపై రెండు అదనపు గడ్డర్లు ఏర్పాటుకు రూ.1684కోట్లు ప్రతిపాదించారు. కాగజ్‌నగర్‌ పట్టణ స్టేషన్‌లో మరో ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50కోట్లు, రైళ్లు, రైల్వే లైన్‌ పక్కన రోడ్డు లైన్‌, వాటర్‌ సిస్టం కోసం రూ.13.02కోట్లు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement