నీటి వనరుల సంరక్షణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులతో నీటి వనరుల రక్షణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 150 చెరువులను చిత్తడి నేలలుగా గుర్తించినట్లు తెలిపారు. అధికారులు ఆయా చెరువులను సందర్శించి నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో సురక్షితంగా పర్యావరణ హితంగా పంతంగులను ఎగురవేసే పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు ప్రభాకర్, గుణవంత్‌రావు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలి
వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జల్ సేవా అంకలన్ పథకం కింద జిల్లాలో 15 పంచాయతీలు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 20న సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి తాగునీటిపై చర్చించాలని సూచించారు. ఫిబ్రవరిలో తాగునీటి వనరులను తనిఖీ చేయాలన్నారు. పైప్‌లైన్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, గ్రిడ్ ఈఈ రాకేశ్, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.


