కెరమెరి: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు నిర్భయంగా రాయాలని ఏసీఎంవో (జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి) పుర్క ఉద్దవ్ అన్నారు. మండలంలోని అనార్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే పెద్ద కళాశాలల్లో ఉచితంగా సీటు వచ్చే ఆస్కారం ఉందన్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు రాత్రి, పగలు చదవాలని, పక్కా ప్రణాళికతో చదివితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అనార్‌పల్లి, జైరాంగూడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం రాము, ఎస్సీఆర్‌పీ నరేశ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.