ఖమ్మం మామిళ్లగూడెం: ఢిల్లీలో డీ.కే.పేజెంట్ ఆర్గనైజేషన్ ఇటీవల నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ ఇండియా–2026 పోటీల్లో ఖమ్మంకు చెందిన కోపూరి అలేఖ్య ‘ప్రైడ్ మిసెస్ తెలంగాణ’ కేటగిరీలో విజేతగా నిలిచారు. మిస్టర్, మిస్, మిస్ టీన్, మిసెస్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా... ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో అలేఖ్య టైటిల్ దక్కించుకున్నారు. ఆమె అన్ని దశల్లోనూ ఆకట్టుకునే రీతిలో ప్రదర్శన ఇచ్చి విజేతగా నిలిచారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తి నగర్: ఖమ్మంలోని టీటీడీసీ భవన్‌లో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్‌మేళాలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి, 1 – 5 ఐదేళ్ల లోపు వివిధ కంపెనీల్లో పని చేసిన అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని, వివరాలకు 70759 36289 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
11న హ్యాండ్‌బాల్
జట్టు ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా స్థాయి బాలికల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికకు ఈనెల 11న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.మోహన్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఉదయం 9గంటకల్లా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు ఐ.రామాంజనేయులు(97037 94650)ను సంప్రదించాలని సూచించారు.
వారం కాకముందే
సీఐ బదిలీ !
ఖమ్మంక్రైం: ఖమ్మం ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించి వారం కాక ముందే బదిలీ జరగడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. సీటీసీలో పనిచేస్తున్న కె.శివప్రసాద్‌ను ఖమ్మం ట్రాఫిక్ సీఐగా బదిలీ చేస్తూ గత నెల 28న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయన ఈనెల 1వ తేదీన విధుల్లో చేరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ ఆయనను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం. కాగా, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వారి సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐని ట్రాఫిక్ స్టేషన్‌కు తీసుకొచ్చేలా శివప్రసాద్‌ను బదిలీ చేయించారనే చర్చ జరుగుతోంది. దీంతో ఇంకొన్ని స్థానాల్లో విధుల్లో చేరిన సీఐలకు స్థానచలనం తప్పదా అనే ప్రచారం మొదలైంది. ఖమ్మంలోని ఓ పోలీసుస్టేషన్ సీఐ విధుల్లో చేరడానికి ఆలస్యం వెనుక కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానానికి ఇంకొకరిని తీసుకురావాలనే భావనతో విధుల్లో చేరకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారని సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
కామేపల్లి: ఎరువుల దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ధనపరి పుల్లయ్య హెచ్చరించారు. మండలంలోని రాయిగూడెం, బర్లగూడెం, జాస్తిపల్లిల్లో ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే రైతులకు పూర్తి వివరాలతో బిల్లులు ఇవ్వాలని, స్టాక్ వివరాలు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు. కాగా, రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఏఓ భూక్యా తారాదేవి, ఏఈఓ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


