రోజుకు 5వేలు సాధ్యమేనా?! | - | Sakshi
Sakshi News home page

రోజుకు 5వేలు సాధ్యమేనా?!

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

జిల్లాలో ఇంకా 10వేల

పింఛన్‌ దరఖాస్తులు పెండింగ్‌

‘చేయూత’ దరఖాస్తుల పరిశీలనపై అనుమానాలు

దసరా నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. కానీ జిల్లాలో దరఖాస్తుల పరిశీలన మందకొడిగా జరుగుతుండడంతో గడువులోగా పూర్తవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 27,766 దరఖాస్తులు రాగా, కొన్నింటి ఆన్‌లైన్‌ కూడా పూర్తి కాలేదు. దరఖాస్తుల పరిశీలనకు రెండు రోజుల సమయమే ఉండగా, ఇంకా 10,650 దరఖాస్తులు మిగిలి ఉండడం గమనార్హం.

ఆన్‌లైన్‌ అయినవి 25 వేలే..

జిల్లావ్యాప్తంగా మండలాలు, మున్సిపాలిటీల్లో27,766 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 25,455 దరఖాస్తులనే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగిలిన 2,311 దరఖాస్తులు ఆన్‌లైన్‌ కాకపోవడంతో దసరా నాటికి అర్హులందరికీ పెన్షన్లు ఎలా మంజూరవుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఆన్‌లైన్‌ కాకపోవడం.. మరోవైపు దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.

పరిశీలన పూర్తయ్యేనా?

ఈనెల 25వ తేదీ శుక్రవారం నాటికి దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు గడువు విధించారు. కానీ జిల్లాలో మిగిలిన 10,650కి పైగా దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి ఆన్‌లైన్‌ ఎంట్రీ చేయడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. దసరాకు పెన్షన్‌ మంజూరు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించినా... దరఖాస్తుల పరిశీలనకు అధికారులు రాకపోవడంతో ఉత్కంఠకు గురవుతున్నారు.

మొదటి స్థానంలో మధిర

దరఖాస్తుల పరిశీలనలో కొన్ని మండలాలు, మున్సిపాలిటీలు ముందంజలో ఉన్నాయి. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో వేగంగా సాగుతోంది. మధిర మున్సిపాలిటీ 89.05 శాతంతో మొదటి స్థానాన నిలవగా, సత్తుపల్లి మున్సిపాలిటీ 88.15శాతం, కామేపల్లి మండలం 84.96శాతంతో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఇక ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ వచ్చిన 4,555 దరఖాస్తుల్లో ఇప్పటికీ 3,436 దరఖాస్తులు(77.91శాతం) పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే కేవలం 22.09శాతమే పరిశీలన పూర్తయింది. అలాగే ఎర్రుపాలెం 35.71 శాతం, కూసుమంచి 44శాతం, ముదిగొండ 49.72 శాతంతో ఈ మండలాలు 50 శాతం కంటే తక్కువగా పరిశీలించారు.

అన్ని కోణాల్లో విచారణ

సత్తుపల్లి టౌన్‌: జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో 726, మధిరలో 610, సత్తుపల్లిలో 550, కల్లూరులో 391 దరఖాస్తులు అందాయి. వీటి ఆధారంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల సమగ్ర వివరాలు ఆరా తీస్తున్నారు. దరఖాస్తుదారుల ఫొటో, ఆధార్‌, రేషన్‌ కార్డులే కాక ఇతర వివరాలు సేకరించి అక్కడికి యాప్‌లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల సమయాన అప్‌లోడ్‌ చేయని ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తున్న అధికారులు.. ఏవైనా పత్రాలు అందుబాటులో లేకపోతే దరఖాస్తులను హోల్డ్‌లో పెడుతున్నారు. ఈమేరకు యాప్‌లో 12ప్రశ్నలకు జవాబులు నమోదు చేయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement