అన్నింట్లో కాదు కొన్నే.. | - | Sakshi
Sakshi News home page

అన్నింట్లో కాదు కొన్నే..

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● చేపపిల్లల పంపిణీ పథకంలో మార్పులు ● మూడొంతుల నీరు ఉంటేనే అమలు ● ఉమ్మడి జిల్లాలో 1,600కు బదులు 800 చెరువుల్లోనే పిల్లలు?

ఇరిగేషన్‌ నివేదిక ఆధారంగా..

● చేపపిల్లల పంపిణీ పథకంలో మార్పులు ● మూడొంతుల నీరు ఉంటేనే అమలు ● ఉమ్మడి జిల్లాలో 1,600కు బదులు 800 చెరువుల్లోనే పిల్లలు?

ఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల ఉపాధే లక్ష్యంగా రూపొందించిన చేప పిల్లల పంపిణీ పథకానికి ఈసారి వరుణుడి రూపంలో అవాంతరాలు ఎదురయ్యాయి. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనగా వ్యవసాయ రంగానికే కాక అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. వర్షాలు లేక జలాశయాల్లో నీరు ఆశించిన స్థాయిలో చేరకపోవడంతో చేపపిల్లల పంపిణీ పథకంలో మార్పులు, చేర్పులకు నిర్ణయించారు.

మారుతున్న ప్రతిపాదనలు

ఏటా మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం చేపపిల్ల ల పంపిణీకి నిధులు మంజూరు చేసి జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని తొలుత ఆదేశించింది. దీంతో అధికారులు జలాశయాల విస్తీర్ణం ఆధారంగా రెండు సైజుల్లో చేపపిల్లల సేకరణకు ఆగస్టులో టెండర్లు ఆహ్వానించారు. ఈమేరకు అర్హత సాధించిన వారి సీడ్‌ చెరువులను నిపుణుల బృందం తనిఖీ చేసింది. ఇక చేపపిల్లలు వదలడమే తరువాయి అనుకుంటున్న క్రమాన వర్షాభావ పరిస్థితులతో ప్రభుత్వం పునఃపరిశీలించాలలని మత్స్యశాఖను ఆదేశించింది. దీంతో ప్రతిపాదనలు పూర్తిగా మారనున్నాయి. ఈమేరకు మత్స్యశాఖ వినతితో 0–25 శాతం, 25 – 50 శాతం నీరు ఉన్న జలాశయాల వివరాలను ఇరిగేషన్‌ శాఖ అధికారులు సమర్పించారు.

సగం సగమే...

ఇరిగేషన్‌ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా చేపపిల్లలు ఎదిగే స్థాయిలో నీరు ఉన్న చెరువుల్లోనే వదలనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని 862 జలాశయాల్లో రూ.4.60 కోట్లతో 3.47 కోట్ల చేపపిల్లలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 740 జలాశయాల్లో రూ.2కోట్లతో 1.80కోట్ల చేప పిల్లలను వదిలేందుకు తొలుత టెండర్లు పూర్తి చేశారు. కానీ నీటి కొరత కారణంగా లక్ష్యం 50 శాతానికి పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో వేలాది మంది మత్స్యకారుల ఉపాధికి ఇక్కట్లు ఎదురవుతాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 25 వేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు అంచనా.

ప్రణాళికలు మరోసారి

ఇరిగేషన్‌ శాఖ ఇచ్చిన నివేదికలు, జలాశయాల్లో నీటి వనరుల ఆధారంగా చేప పిల్లల పథకానికి మరోసారి మత్స్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే కొత్తగా టెండర్లు పిలిచే అవకాశం లేనందున గతంలో ఖరారు చేసిన టెండర్‌దారుల నుంచి చేపపిల్లలు సేకరించే అవకాశముంది. పూర్తి సామర్థ్యంలో మూడు వంతుల నీరు ఉన్న జలాశయాల్లోనే చేప పిల్లలు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుండగా.. ఖమ్మం జిల్లాలో 430, భద్రాద్రి జిల్లాలో 370 వరకు జలాశయాల్లో మాత్రమే పథకం అమలయ్యే అవకాశముంది.

జలాశయాల్లో నీటి నిల్వలపై ఇరిగేషన్‌ శాఖ నుంచి నివేదికలు అందాయి. వీటి ఆధారంగా చేపల పిల్లల పథకం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నీరు ఉన్న జలాశయాల్లో చేప పిల్లలు వదిలే అవకాశముంది. కొద్ది రోజుల్లో పథకానికి తుదిరూపం వస్తుంది.

– మల్లేశం, శివప్రసాద్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మత్స్యశాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement