ఖమ్మంమయూరిసెంటర్: దసరా సందర్భంగా కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ముఖాల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కాగా, ఇటీవల తిరుమలాయపాలెం మండలంలో కాంగ్రెస్ నేతల కారుపై బీఆర్‌ఎస్ నాయకులు రాళ్ల దాడి చేయడం గర్హనీయమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో హితవు పలికారు.
27న అండర్–19
క్రీడా జట్ల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఆర్చరీ, వాలీబాల్, కరాటే, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేస్తామని, ఇక్కడ ఎంపికయ్యే జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సివిల్స్ ఉచిత శిక్షణ
దరఖాస్తు గడువు పొడిగింపు
భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆబ్జెక్టివ్, ఆప్టిట్యూడ్ స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, అర్హులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం 91210 87421, 62817 66534 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు.
గిరిజన యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ
భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు 3 – 4 నెలల పాటు ఉచిత ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం వైటీసీల్లో టైలరింగ్, బ్యూటీ థెరపిస్ట్, కంప్యూటర్ హార్డ్‌వేర్, డ్రోన్ టెక్నీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల వయసు ఉండి, 5వ తరగతి నుంచి ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, మెటీరియల్స్ అందుతుందని తెలిపారు. వివరాలకు 93474 66615, 81061 41505 నంబర్లలో సంప్రదించవచ్చని పీఓ వెల్లడించారు.
న్యాయవాదుల ధర్నా
ఖమ్మం లీగల్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యాన న్యాయవాదులు బుధవారం ధర్నా చేపట్టారు. కేంద్ర న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ యాక్ట్‌ను సవరించడంతో పాటు న్యాయవాదులు మృతి చెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10వేల స్టైఫండ్ ఇవ్వాలనే డిమాండ్లతో జిల్లా ప్రధాన కోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రారంభమైన ‘ఏకలవ్య’ క్రీడా పోటీలు
టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి చదువుతో పాటు క్రీడలు అవసరమని పేర్కొన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుందని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత దక్కుతుందని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, టేకులపల్లితో పాటు గుండుగలపల్లి, ములకలపల్లి, చర్ల, పాల్వంచ, గుండాల, సింగరేణి, దుమ్ముగూడెం ఏకలవ్య పాఠశాలలకు చెందిన 320 మంది క్రీడాకారులు హాజరుకాగా, మూడు రోజుల పాటు హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, పరుగు పందెం తదితర అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, నోడల్ ఆఫీసర్ కృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ వీరూనాయక్, ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణవ, సర్పంచ్ నరేష్, ఎస్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.


