26న చాకలి ఐలమ్మ, 27 బాపూజీ జయంతి | - | Sakshi
Sakshi News home page

26న చాకలి ఐలమ్మ, 27 బాపూజీ జయంతి

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఈనెల 26 న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద జయంతి వేడుకలు 26న ఉదయం 9గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. అలాగే, ఈనెల 27న కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జ్యోతి వెల్లడించారు. లకారం ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న బాపూజీ విగ్రహం వద్ద వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఆయుర్వేద వైద్యంపై

అవగాహన అవసరం

ఖమ్మంఅర్బన్‌: ప్రజలు ఆయుర్వేద వైద్యవిధానంపై అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు సూచించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఖమ్మం ఖానాపురంలో ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యశాలల ఆధ్వర్యాన ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన రామారావు మాట్లాడుతూ మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రతిఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుందని తెలిపారు. కాగా, శిబిరంలో 436మందికి వైద్యపరీక్షలు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. మెడికల్‌ ఆఫీసర్లు, నోడల్‌ అధికారులు కె.పద్మావతి, వై.ఉపేందర్‌, బి.సుధాకర్‌, డీపీఎం బాబూనాయక్‌, మాజీ కౌన్సిలర్‌ జోగుపర్తి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరుగా చెత్త సేకరణకు ప్రణాళిక

ముదిగొండ: ప్రతీ గ్రామంలో నాలుగు రకాల చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రణాళిక రూపొందించాలని పంచాయతీ రాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత సూచించారు. మండలంలోని వనం వారి కిష్టాపురంలో బుధవారం ఆమె పర్యటించారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేసిన గ్రామపటం ఆధారంగా యాక్షన్‌ ప్లాన్‌ను పరిశీలించారు. అనంతరం డీపీఓ వినోద్‌తో కలిసి గ్రామంలో మొక్కలు నాటాక విద్యాలత మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలని, నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆతర్వాత ముదిగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె రికార్డులు పరిశీలించారు. సర్పంచ్‌ పర్ణకోల జ్ఞానమేరీ సరళ, ఎంపీడీఓ విజయ, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, అడిషనల్‌ డీఆర్‌డీఏ శిరీష, ఏపీడీ శ్రీదేవి, డీఎల్‌పీఓలు రాంబాబు, విజయలక్ష్మి, ఎంపీఓ రామకృష్ట పాల్గొన్నారు.

‘రైసెట్‌’ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ

ఖమ్మంరూరల్‌: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎస్‌బీఐ రైసెట్‌ ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ సి.చంద్రశేఖర్‌ తెలిపారు. బ్యూటీ పార్లర్‌ మేనేజ్‌మెంట్‌(మహిళలకు)తో పాటు హౌజ్‌ వైరింగ్‌, సీసీ కెమెరా నిర్వహణ, పుట్టగొడుగుల పెంపకం, జ్యూట్‌ బ్యాగ్‌ తయారీలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటామని, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు. కోర్సు పూర్తయ్యాక ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ జారీ చేయడమే కాక స్వయం ఉపాధి, వ్యాపారం కోసం బ్యాంకు రుణాల మంజూరులో సహకరిస్తామని వెల్లడించారు. ఈమేరకు జిల్లాకు చెందిన 18–45 ఏళ్ల వయస్సు వారు ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లతో వరంగల్‌ క్రాస్‌రోడ్‌ తరుణిహాట్‌లోని రైసెట్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 95509 86616, 630143 38045 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని డైరెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement