చినుకమ్మా.. జాడేదమ్మా?! | - | Sakshi
Sakshi News home page

చినుకమ్మా.. జాడేదమ్మా?!

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

తీవ్ర వర్షాభావం ఉన్న మండలాలు

యాసంగి పంటలు లేనట్లే..

కేవలం ఒక్క మండలంలోనే సాధారణ వర్షపాతం

గత 22ఏళ్లలో లేనివిధంగా లోటు

‘నైరుతి’ కాలంలో మిగిలింది ఈ నెల మాత్రమే..

జూన్‌ నుంచి ఆగస్టు వరకు వర్షపాతం

మండలం లోటు (శాతం)

ఎర్రుపాలెం 59

సత్తుపల్లి 51

కూసుమంచి 46

ఖమ్మంఅర్బన్‌ 40

కొణిజర్ల 40

రఘునాథపాలెం 38

తిరుమలాయపాలెం 38

నేలకొండపల్లి 38

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాపై ఎల్‌నినో తీవ్ర స్థాయిలో పంజా విసిరింది. గత 22ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి పవన కాలంలో గడిచిన మూడు నెలల్లో జిల్లాలోని 21 మండలాలకు గాను 20 మండలాల్లో వర్షాభావం ఏర్పడింది. కేవలం కల్లూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో సగటున ఒక్కో మండలంలో 60.3 సెం.మీ.కు బదులు 40.2 సె.మీ. వర్షపాతమే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నారు. ఇక మిగిలి సెప్టెంబర్‌లోనూ సాధారణ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

1.18 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు

వర్షాలు ఆశించిన స్థాయిలో కురిస్తే జిల్లాలో సాధారణ విస్తీర్ణాన్ని మించి పంటలు సాగవుతాయి. సాగర్‌ జలాలకు తోడు జిల్లాలోని వనరుల ఆధారంగా మెట్ట పంటల సాగుతో కళకళలాడేది. కానీ ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 5,53,329 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా 4,34,446 ఎకరాలకే పరిమితమైంది. అంటే 1,18,883 ఎకరాల్లో పంటల సాగు తగ్గడం గమనార్హం. గోదావరి జలాలను రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టులోని వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు ఇస్తుండడంతో పంటల సాగు ఈ మూడు నియోజకర్గాల్లో కొంత బాగానే ఉంది. ఈ జలాలు కూడా రాకపోతే 2.50 లక్షల ఎకరాలకే పంటల సాగు పరిమితమయ్యేది.

వర్షించని మేఘాలు

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి పవన కాలంగా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కురిసే వర్షాలతో నదులు, వాగులు, వంకల వరదలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండితే రెండు సీజన్లలో సాగుతో తాగునీటికి ఢోకా ఉండదు. కానీ ఎల్‌నినోతో వాతావరణ పరిస్థితులు తారుమారయ్యాయి. నైరుతి రుతు పవనాలు వెనకబాటు, ఎండ వేడితో మబ్బులు పడుతున్నా మేఘాలు వర్షించడం లేదు. జూన్‌లో సగటు వర్షపాతం 13.సెం.మీ.కు గాను 15.3 సెం.మీ, జూలైలో 24.1 సెం.మీ.కు 8.4 సెం.మీ., ఆగస్టులో 24.0 సెం.మీ.కు 16.6 సెం.మీ. వర్షపాతమే నమోదైంది.

ఇది నేలకొండపల్లి మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు. ఏటా వర్షాకాలంలో సమృద్ధిగా నీరు చేరేది. గత ఏడాది ఆగస్టులో చెరువు నిండి అలుగు పారింది. కానీ ఈసారి చూద్దామన్నా కనుచూపు మేర నీరు కనిపించడం లేదు. గడ్డి పెరిగి పొలాన్ని తలపించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారని గ్రామస్తులు చెబుతున్నారు.

నైరుతి రుతు పవన కాలం నాలుగు నెలల్లో మూడు నెలలు వర్షాలు ముఖం చాటేశాయి. ఎల్‌నినో తీవ్రతతో సెప్టెంబర్‌లోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో వానాకాలంలో సాగు చేసిన పంటలు చేతికి వస్తే చాలన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండితే తప్ప యాసంగి సాగుపై ఆశలు పెట్టుకోవడంలేదు. వానాకాలమే వర్షాలు లేక ఎండలు మండుతుండడం, చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడంతో యాసంగి సాగు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నీటి వనరుల్లో కొంతమేర ఉన్న జలాలను వచ్చే వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలనే అంశంపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది.

జిల్లాలోని 20 మండలాల్లో వర్షాభావం

వర్షం అంచనా 60.3 సెం.మీ

కురిసింది 40.2 సెం.మీ

లోటు 33 శాతం

వర్షపాతం లోటు ఉన్న మండలాలు 20

సాధారణ వర్షపాతం నమోదైన మండలం 01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement