నోటీసులు.. విచారణ | - | Sakshi
Sakshi News home page

నోటీసులు.. విచారణ

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

జిల్లాలో కొనసాగుతున్న ‘సర్‌’

అనామలీస్‌ ఓటర్లకు నోటీసుల జారీ

విధుల్లో నిర్లక్ష్యం తేలడంతో

బీఎల్‌ఓ, సూపర్‌వైజర్‌ సస్పెన్షన్‌

ఖమ్మం సహకారనగర్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) జిల్లాలో వేగంగా జరుగుతోంది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,75,840 మంది ఓటర్ల పేర్లు అనామలీస్‌ జాబితాలో ఉండగా, నోటీసులు జారీ చేసే ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పటికే 78,559 మందికి నోటీసులు ఇవ్వడంతో 44.68శాతంగా నమోదైంది. ప్రధానంగా పేర్లలో అక్షర దోషాలు, వయస్సు తేడా ఇలా పలు రకాల కారణాలతో నోటీసులు ఇస్తున్నారు. ఇంకొందరికి సంబంధించి వయసు తేడా, ఇతర కారణాలతో నో మ్యాపింగ్‌ జాబితాలో చేర్చారు.

నోటీసులకు కవర్లు

అనామలీస్‌ జాబితాలో ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక కవర్లను సైతం ఎన్నికల సంఘం కేటాయించింది. ఈమేరకు కవర్లు కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగానికి చేరాయి. వీటి ద్వారా నోటీసులను జాబితాలోని ఓటర్లకు అందించనున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డుసభలు జరుగుతుండగా, నోటీసులు అందుకున్న వారు తగిన ఆధారాలతో బీఎల్‌ఓలను సంప్రదించాల్సి ఉంటుంది.

అనామలీస్‌ ఓటర్లు సమర్పించాల్సిన పత్రాలు

● భారతదేశంలో 01–07–1987కి ముందు జన్మించిన ఓటరు తన పుట్టిన తేదీ / నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

● 01–07–1987 నుంచి 02–12–2004 మధ్య జన్మించిన వారైతే పుట్టిన తేదీ / నివాస ధ్రువపత్రంతో పాటు తండ్రి లేదా తల్లి సర్టిఫికెట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది.

● 02–12–2004 తర్వాత జన్మించిన వారు ఓటరు సంబంధిత ధ్రువపత్రంతో పాటు తల్లిదండ్రులిద్దరి ధ్రువపత్రాలు అందించాలి. అలాగే, తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతీయులు కాకపోతే వారి చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు / వీసా కాపీ సమర్పించాలి.

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరి సస్పెన్షన్‌

స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఒక బీఎల్‌ఓ, మరో సూపర్‌వైజర్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మంలో బీఎల్‌ఓగా నిర్వర్తిస్తున్న వై.కృష్ణకుమారి(మెప్మా ఆర్‌పీ), సూపర్‌వైజర్‌గా జె.విజయకుమారి(ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, బీజేపీ నాయకుడు, పార్టీ బీఎల్‌ఏగా వ్యవహరిస్తున్న వి.రాజేష్‌ ఓటు ముసాయిదా జాబితాలో లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ విచారణ చేపట్టగా ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఇద్దరిని సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement