జీపీల అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీపీల అభివృద్ధికి కృషి చేయాలి

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

పంచాయతీరాజ్‌ శాఖ డీడీ విద్యాలత

కొణిజర్ల: గ్రామపంచాయతీల అభివృద్ధికి పాలక మండళ్ల బాధ్యులు, మండల పరిషత్‌ అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ డైరక్టర్‌ ఎం.విద్యాలత సూచించారు. కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో గ్రామ సమాఖ్య భవనం, డ్రెయిన్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను సోమవారం ఆమె పరిశీలించారు. అలాగే, వన మహోత్సవంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో మొక్క నాటారు. అనంతరం డీడీ మాట్లాడుతూ వీబీజీ రామ్‌కు సంబంధించి పనుల గుర్తింపు మొదలుపెట్టాలని సూచించారు. అలాగే, అభివృద్ధి నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ పి.శ్రీనివాసరావు, డీఎల్‌పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ రామిరెడ్డి ఉపేంద్రయ్య, సర్పంచ్‌ వేము నాగరాజు, ఉపసర్పంచ్‌ సురభి కృష్ణ, వివిధ శాఖల ఉద్యోగులు కిషోర్‌, అమ్మాజాన్‌, సునీల్‌, పవన్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, డీడీగా పదోన్నతి పొందాక తొలిసారి కొణిజర్ల మండలానికి వచ్చిన విద్యాలతను ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సత్కరించారు.

కల్లూరు ప్రభుత్వ కాలేజీకి బాలికల హాస్టల్‌

కల్లూరురూరల్‌: కల్లూరులోని ప్రభుత్వ జూని యర్‌ కాలేజీకి అనుబంధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బాలికల హాస్టల్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల వసతి నిమిత్తం హాస్టల్‌ మంజూరు చేయాలని ప్రిన్సిపాల్‌ వేముల శేఖర్‌ గతంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈమేరకు జిల్లాకు రెండు బాలికల హాస్టళ్ల మంజూరు చేయగా ఒకటి కల్లూరుకు కేటాయించారు. త్వరలోనే అనువైన భవనాన్ని గుర్తించి హాస్టల్‌ ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

కరాటే కోచ్‌ల నుంచి

దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం స్పోర్ట్స్‌: బాలికల స్వీయ రక్షణకోసం ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎంశ్రీ పథకం కింద శిక్షణ ఇవ్వనుండగా, ఆసక్తి ఉన్న కోచ్‌లు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. బాక్‌ బెల్ట్‌ ఉన్న వారే అర్హులని, నెలకు 24రోజుల చొప్పున మూడు నెలల శిక్షణకు గౌరవ వేతనంగా రూ.10 వేలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న సర్టిఫికెట్లతో ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని డీవైఎస్‌ఓ సూచించారు.

2,142 మె.టన్నుల యూరియా

చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు సీఐఎల్‌ కంపెనీకి చెందిన 2,142 మెట్రిక్‌ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 742 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్‌ టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 800 మె.టన్నులు కేటాయించగా మిగతా 100 మె.టన్నులు బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని డీఏఓ పుల్లయ్య తెలిపారు.

పౌర సరఫరాల సంస్థ డీఎంగా మల్లికార్జున్‌బాబు

ఖమ్మం సహకారనగర్‌: పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా ఎం.మల్లికార్జున్‌బాబు నియమితులయ్యారు. కొన్నాళ్లుగా ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇంతలోనే జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి(డీసీఎస్‌ఓ) చందన్‌కుమార్‌ కూడా సెలవులో వెళ్లడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో హైదరాబాద్‌ పౌరసరఫరాల శాఖ ఏసీఎస్‌ఓగా పని చేస్తున్న మల్లికార్జున్‌బాబును ఖమ్మం డీఎంగా నియమించారు. అంతేకాక డీసీఎస్‌ఓగా ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఆయనకు అప్పగించగా సోమవారం ఆయన విధుల్లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement