● సింగరేణికి మేలు చేసినట్లుగా కేంద్రమంత్రి ప్రగల్భాలు ● ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
ఖమ్మంవైరారోడ్: కేంద్రం వేలం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల జాబితాలో తాడిచర్ల–2 బ్లాక్ లేదని, దీనిని సింగరేణికి కొత్తగా కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి సోమవారం ఆయన మాట్లాడారు. 1995లోనే సింగరేణి ఈ బ్లాక్‌ను గుర్తించగా, అనుమతులు వచ్చాయని తెలిపారు. మునుపెన్నడూ సింగరేణి విషయంలో కిషన్‌రెడ్డి మాట్లాడకపోగా, బొగ్గు బావులను వేలం వేస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి టెండర్లకు సహకరించారే తప్ప అడ్డుకోలేదన్నారు. కాగా, సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ లేఖలు రాసినా కిషన్‌రెడ్డి స్పందించకపోవడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందాలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా ఆయనకు సింగరేణిపై నిజంగా ప్రేమ ఉంటే కోయగూడెం–3, సత్తుపల్లి–3, శ్రావణపల్లి మైన్లను కూడా కేటాయించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్ట సవరణలతోనే సింగరేణికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అలాగే, బీఆర్‌ఎస్ హయాంలో పునరుద్ధరించిన మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రతీ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. ఖమ్మం బుర్హాన్‌పురంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయనతో పాటు కుటుంబ సభ్యుల ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్‌ఓ సావిత్రికి అందజేశారు. అనంతరం ఎంపీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్‌పై వివరాలు ఆరా తీశారు. మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, పలువురు నాయకులు పాల్గొన్నారు.


