ప్రతీసారి పరిహాసమే.. | - | Sakshi
Sakshi News home page

ప్రతీసారి పరిహాసమే..

Feb 26 2026 8:35 AM | Updated on Feb 26 2026 8:35 AM

ప్రతీసారి పరిహాసమే..

ప్రతీసారి పరిహాసమే..

సీజన్ల వారీగా పంట నష్టాలు

సర్వేలు.. ఆపై నివేదికలతోనే సరి జిల్లా రైతులకు ఇప్పటికే రూ.10కోట్ల మేర బకాయి తాజా నష్టంతో పరిహారానికి ప్రతిపాదనలు

ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలతో పంట నష్టపోతున్న రైతులకు పరిహారం కాగితాలకే పరిమితమవుతోంది. పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వాలు నిబంధనల మేరకు పరిహారం చెల్లించడం ఆనవాయితీ. అధికారులతో సర్వే చేయించి ప్రకృతి వైపరీత్యం కారణంగా 33 శాతం పంట నష్టం జరిగితే వారికి పరిహారం చెల్లించేలా నివేదికలు తీసుకుంటారు. అయితే, సర్వే, నివేదికల తయారీ, అందించడం ప్రతీసారి జరుగుతున్నా రైతులకు పరిహారం మాత్రం దక్కకపోవడంతో నష్టం మిగిల్చిన బాధ వారిని వెంటాడుతోంది.

2024 నుంచి పెండింగ్‌

పరిహారం చెల్లింపులు ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నాయి. 2024 వానాకాలంలో భారీ వర్షాలతో జిల్లా రైతులు పెద్దమొత్తంలో పంటలు కోల్పోయారు. ఆ సమయాన రూ.కోట్లలో పంటలకు నష్టం వాటిల్లగా, కొన్నిచోట్ల భూముల్లో ఇసుక మేటలు, రాళ్ల కుప్పలు నిండిపోయాయి. ఇక 2025 ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలు యాసంగి పంటలను దెబ్బతీశాయి. చేతికందే దశలోని పంటలను ఈదురుగాలులు, అకాల వర్షం ధ్వంసం చేశాయి. అలాగే, 2025 వానాకాలంలో సాగు సీజన్‌ ప్రారంభంలోనే వరుణుడి ప్రతాపానికి రూ. కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. ఇక అక్టోబర్‌లో మోంథా తుపాను పంటలపై పంజా విసిరింది. చేతికందే దశలో ఉన్న పత్తి, వరితో పాటు మిర్చి, కూరగాయల పంటలను రైతులు కోల్పోయారు. తాజాగా గాలిదుమారం, అకాల వర్షానికి జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి.

నివేదికలకే పరిమితం

ఎండనకా, వాననక రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి ప్రకోపంతో నష్టాలు ఎదురవుతున్నా నిబంధనల మేరకు కనీస పరిహారం చెల్లింపులోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2024 నుంచి ఐదు సార్లు ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు రూ.9.63 కోట్ల మేర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ పరిహారంతో రైతులకు న్యాయం జరగకున్నా, మరో పంట సాగుకై నా ఉపయోగపడే అవకాశముంటుందని చెబుతున్నారు.

2024 వానాకాలం సీజన్‌ ఆగస్టులో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పంటలపై ఇసుక మేటలు వేయగా, కొన్నిచోట్ల ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. ఈ సమయాన జిల్లాలో 27,693మంది రైతులకు చెందిన 28,322.34ఎకరాల్లో వరి, పత్తి పంటలు ధ్వంసమయ్యాయి. ఇందులో కొందరికి రెండు దఫాల్లో పరిహారం చెల్లించినా, ఇంకా 154.36ఎకరాలకు సంబంధించి 109మంది రైతులకు రూ.15.49లక్షలు విడుదల కాలేదు.

2025 ఏప్రిల్‌లో ఈదురుగాలులు, అకాల వర్షానికి మొక్కజొన్న, వరికి నష్టం వాటిల్లింది. 289మంది రైతులకు చెందిన 460.28ఎకరాల్లో పంటలకు నష్టం జరగగా రూ.46.07లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.

2025 మేలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వైపరీత్యానికి 43మంది రైతులకు చెందిన 87.10 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రైతులకు రూ.8.72 లక్షల పరిహారం అందాల్సి ఉంది.

2025 వానాకాలం ఆగస్టులో అధిక వర్షాల కారణంగా 3,635మంది రైతులకు చెందిన 4,654.16 ఎకరాల్లో పత్తి, వరి, పెసర పంటలకు నష్టం జరిగింది. రైతులకు చెల్లించాల్సిన రూ.4.65కోట్ల పరిహారం నేటికీ విడుదల కాలేదు.

2025 అక్టోబర్‌లో మోంథా తుపాను కారణంగా 4,268 మంది రైతులకు చెందిన 4,277 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, కూరగాయలు తదితర పంటలకు నష్టం జరిగింది. వీరికి రూ.4.27 కోట్ల పరిహారం చెల్లించలేదు.

తాజాగా కురిసిన అకాల వర్షంతో జిల్లాలో 1,926 మంది రైతులకు చెందిన మొక్కజొన్న, పెసర పంటలు 4,197 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నష్టంపై వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేయగా, రైతులకు దాదాపు రూ.4కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement